నెల్లూరు : మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి
సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు. అవే వస్తే
తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సైదాపురం
మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు. ‘‘ప్రజలు
వైసీపీకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి
కాలేదు. ఇందుకు సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపు జాప్యమా? తెలియడం లేదని
అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికలకు ఇప్పుడే నా సీటుకు ఎసరు : వైసీపీ ఎమ్మెల్యే ఆనం
రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ
‘‘వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2024 వరకు నేనే ఇక్కడ
ఎమ్మెల్యేని. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు, ఇప్పుడే నా సీటుకు ఎసరు
పెడుతున్నారు. వెంకటగిరికి నేనే రేపు ఎమ్మెల్యే అని ఓ పెద్దమనిషి
చెప్పుకుంటున్నాడు. వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? కుర్చీ లాగేద్దామా అని
కొంతమంది ఆశపడుతున్నారు’’ అంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి
రాంకుమార్ రెడ్డిపై ఆనం రామనారాయణ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఆనంకు ఘోర అవమానం : వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి అవమానం
జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తిన పాపానికి అన్యాయంగా ఆయనను పార్టీ నుంచి
తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి
వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై అధిష్టానం వేటేసింది. పార్టీకి నష్టం
కలిగించేలా ఆనం వ్యాఖ్యలు వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
వైసీపీ నుంచి ఆనంను బహిష్కరించారు. జగన్ ప్రభుత్వ తీరుపై అధికార పక్ష
ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం.? ఏం చేశామని ఓట్లడగాలి.? గ్రామాల్లో ఒక్క
రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అని
ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.
అంచనాలు సిద్ధం చేసి హైకమాండ్‌కు పంపినా స్పందించలేదని చెప్పారు. అమృత్-2
పథకం కింద కేంద్రప్రభుత్వ నిధులతో వెంకటగిరిలో రూ.93కోట్లతో మరో సమ్మర్
స్టోరేజి ఏర్పాటుకు అనుమతులు అందాయన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తయి రెండేళ్లు
కావస్తున్నా తాగునీటి వసతి లేక వాటిని ప్రారంభించలేదన్నారు. కేంద్రం ఇస్తున్న
నిధులు ఎక్కడో అక్కడ సర్దుకుంటూ పోతున్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు
సమీపిస్తున్న వేళ ప్రజల ముందుకు ఎలా వెళ్లి ఓట్లు అడగాలని నిలదీశారు. కేంద్రం
జలజీవన్ మిషన్ ద్వారా నిధులు ఇస్తుంటే ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రజలు
నిలదీస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కలగా పిలుచుకునే
సోమశిల, స్వర్ణముఖి కెనాల్‌ను నిజం చేయలేకపోతున్నట్లు చెప్పారు. కనీసం
ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు పిలిచినా రాలేదంటూ ముఖ్యమంత్రి జగన్‌పై
పరోక్షంగా విమర్శలు సంధించారు.