నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు సీబీఎస్ఈ పాఠశాలలు
ఫిర్యాదులు వస్తేనే నోటీసులిస్తున్న విద్యాశాఖ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలలు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు
లేకుండానే ఆ బోర్డులు తగిలిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి.
ప్రైవేటు పాఠశాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకుని, ఆ తర్వాత
కనీసం అనుబంధ గుర్తింపు కోసం సీబీఎస్ఈ బోర్డుకు దరఖాస్తు కూడా చేసుకోకుండానే
సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికతో తరగతులు ప్రారంభిస్తూ మాయచేస్తున్నాయి. విద్యార్థి
సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్న
రాష్ట్ర విద్యాశాఖ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటోందన్న విమర్శలున్నాయి.
సదరు ఫిర్యాదులను విద్యాశాఖ సీబీఎస్ఈకి పంపే పక్షంలో చర్యలు ఉంటాయని, కనీసం
అదీ జరగకపోవడంతో మోసాలు కొనసాగుతున్నాయని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్
అసోసియేషన్(హెచ్ఎస్పీఏ) ఆందోళన వ్యక్తంచేసింది.
‘వాస్తవంగా సీబీఎస్ఈ అనుమతి కావాలంటే ఆ నిబంధనల ప్రకారం ఆటస్థలం,
గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి వసతులు ఉండాలి. అవేమీ లేకపోవడంతో కొన్ని
యాజమాన్యాలు రాష్ట్ర విద్యాశాఖ అనుమతులతో 9వ తరగతి వరకు పాఠశాలలు నడుపుతూ
సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను బోధిస్తున్నాయి. తద్వారా కొన్నాళ్లపాటు
సీబీఎస్ఈకి ఆయా ఫీజులు చెల్లించకుండా తప్పించుకుంటున్నాయి’ అని హెచ్ఎస్పీఏ
సంయుక్త కార్యదర్శి కడప వెంకట సాయినాథ్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ
గుర్తింపు ఉన్న పాఠశాలలు ఏవి? సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉన్నవి ఏవి? అనే వివరాలను
జిల్లాల వారీగా విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచితే తల్లిదండ్రులు అప్రమత్తమయ్యే
అవకాశం ఉంటుందని, అలా జరగకపోవడంతో తల్లిదండ్రులు మోసపోవాల్సి వస్తోందని ఆయన
పేర్కొన్నారు.
తరచూ ఫిర్యాదులు…చర్యలు శూన్యం : సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు లేకుండానే
పాఠశాలలను ప్రారంభిస్తున్న యాజమాన్యాలపై రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదులు
వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆయా ఫిర్యాదులను డైరెక్టరేట్ అధికారులు డీఈఓలకు
పంపుతుండగా, వారు యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోతున్నారు. దీని
వెనక లంచాల వ్యవహారమూ ఉందనే విమర్శలున్నాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లా
మందమర్రి మండలంలో 2022-23 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈ/స్టేట్
ఇంటిగ్రేటెడ్ కురికులం అంటూ గ్రీన్వుడ్ హైస్కూల్‌ను ప్రారంభించారు.
సీబీఎస్ఈ గుర్తింపు లేకుండానే ఆ పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ
మార్చి నెలలో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.