పోరును కొలిక్కి తేవాలనుకుంటున్నాం : పుతిన్
విజయం దిశగా వెళ్తున్నాం: జెలెన్స్కీ
మాస్కో, కీవ్ : యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్నట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం వేర్వేరుగా ప్రకటించారు. పోరును సత్వరం ముగించాలని అనుకుంటున్నట్లు మాస్కోలో పుతిన్ చెబితే తాము విజయం దిశగా వెళ్తున్నట్లు జెలెన్స్కీ కీవ్‌లో విశ్వాసం వ్యక్తంచేశారు. ఆకస్మికంగా అమెరికా పర్యటనకు వెళ్లి, ఆయుధాల సాయంపై హామీ పొందిన ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఇద్దరు అధినేతల మాటల్లోనూ భిన్నార్థాలు ధ్వనిస్తున్న దృష్ట్యా యుద్ధం ముగిసిపోతుందా, మరింత తీవ్రతరమై పెను నష్టాన్ని మిగులుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
దౌత్య పరిష్కారంతోనే సాధ్యం : రష్యా
ఉక్రెయిన్‌పై పోరు తప్పనిసరిగా దౌత్యపరమైన పరిష్కారంతోనే వీలవుతుందని పుతిన్ అన్నారు. ‘‘సైనిక ఘర్షణను (యుద్ధాన్ని) కొనసాగించడం మా లక్ష్యం కాదు. ‘లక్ష్యాల’ను చేరుకుని, దీనిని ముగించడం కోసమే మేం కష్టపడుతున్నాం. సాయుధ ఘర్షణలన్నీ ఏదో రకంగా చర్చలతోనే ముగుస్తాయి. ఉభయపక్షాలూ ఒక ఒప్పందానికి రావాలి. ఈ విషయాన్ని కీవ్‌లోని మా శత్రువులు అర్థం చేసుకోవాలి. అదే వారికి మంచిదవుతుంది’’ అని పరోక్షంగా ఉక్రెయిన్ను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసే పేట్రియాట్ వ్యవస్థలను ఎదుర్కొనేందుకు తమకు మార్గం తెలుసుననీ, బాగా పాతబడిపోయిన పేట్రియాట్లు తమ ఎస్-300 వ్యవస్థల్లాంటివి కావని కొట్టిపారేశారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ- రష్యా సైనికులకు అవసరమైన అధునాతన ఆయుధాలు, పరికరాలను సరఫరా చేయాలని ఆయుధ పరిశ్రమ వర్గాలను కోరారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించగానే సైనికచర్య ముగుస్తుందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. ఉక్రెయిన్ నిస్సైనికీకరణ దిశగా చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్ని అంగీకరించకుండా ఎలాంటి శాంతి ఒప్పందం విజయవంతం కాబోదన్నారు.
చర్చలకు సంకేతాలేవీ? : శ్వేతసౌధం
చర్చలకు సుముఖంగా ఉన్నట్లు పుతిన్ ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదని శ్వేతసౌధం అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. క్షేత్రస్థాయిలో రష్యా చర్యల్ని చూస్తే వారు ఉక్రెయిన్ ప్రజలపై యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. చర్చలపై పుతిన్‌కు ఆసక్తి ఉన్నట్లయితే.. ఆయనతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సిద్ధమేనని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దాడులు కొనసాగాయి. రాకెట్లు, మోర్టార్ల దాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.