కిస్తీలతో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు ఆర్థిక చేయూత ఇవ్వాలి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అమరావతి : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ లకు న్యాయం జరగాలని
అఖిలపక్ష సమావేశం ముదిరాజ్ చైతన్య వేదిక సంస్థ ఏర్పాటు చేశారు. ఈ
కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ
ముదిరాజ్ లకు న్యాయం చేయడానికి అందరూ కలిసి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
సమాజంలో కుల సమస్యలపై పోరాటం చేయడం మన హక్కు. ఆ సమస్యలను పరిష్కారం అయ్యే
విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మన కర్తవ్యం. ఈరోజు ఆ బాధ్యతతో
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో
అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ లకు ప్రభుత్వాలు తోడ్పాటును అందించాలి. ఇప్పటికీ
ముదిరాజులలో ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. పలు గ్రామాలలో, మండలాలలో, పట్టణాలలో
ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ
ఉన్నారు. రాత్రనక, పగలనకా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటూ బతుకు బండిని లాగిస్తూ
ఉన్నారు. ఎర్రటి ఎండలో పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇది ఎంతో బాధాకరమైన
విషయమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ముదిరాజ్ లు ఆర్థికంగా బలపడాలి.
ఆర్థికంగా ఎంతో ఎత్తు ఎదగవలసిన ముదిరాజులు అష్ట కష్టాలు పడుతున్నారు. వీళ్ళను
ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముదిరాజులు ఆర్థికపరమైన సహకారం కోసం
ముదిరాజుల కార్పొరేషన్ కు 1000కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని
దుండ్రకుమారస్వామి కోరారు. కిస్తీలతో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు ఆర్థిక
చేయూత ఇవ్వాలి. వృత్తి ఆధారిత కుటుంబాలకు వారికి కావలసిన ప్రత్యేక పనిముట్లను,
రవాణా సౌకర్యానికి వాహనాలు, ద్విచక్ర వాహనాలు సమకూర్చాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ మహనీయుల విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి. ముదిరాజ్ లు
ఆర్థికంగా ఎదిగే వరకూ తోడ్పాటును అందించాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్
చేశారు. చేపలు, కూరగాయలు, పండ్లు నిలువ ఉంచడానికి ఉచితంగా గోడౌన్స్ ని
నిర్మాణం చేయాలి. విద్యార్థులకి ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందజేయాలి. విదేశీ
విద్యకు 30 లక్షలు ఉచిత గ్రాండ్ ను మంజూరు చేయాలి. స్త్రీలను ఆర్థికంగా చేయూత
అందించడానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలి. వడ్డీ లేకుండా రుణాలు మంజూరు
చేయాలని, ముదిరాజ్ ల కుటుంబాల బాగుకోసం తోడ్పడాలని జాతీయ బీసీ దళ్ తరపున
డిమాండ్ చేస్తున్నట్లు దుండ్ర కుమార స్వామి తెలిపారు. ముదిరాజ్ లపై దాడి
జరిగితే బీసీ సమాజం మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు దుండ్ర కుమారస్వామి.
శివ ముదిరాజ్ మాట్లాడుతూ జనాభా దామాషగా రాబోయే ఎన్నికల్లో ముదిరాజులకు
సీట్లు కేటాయించాలనీ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అఖిల పక్ష సమావేశంలో
తెలియజేసారు.ఈ అఖిలపక్ష సమావేశంలో శివ ముదిరాజ్, పిట్లా నగేష్, కొరివి కృష్ణ
స్వామి ముదిరాజ్, రమేష్ రాజు, కోట్ల పుష్పలత , కురుమూర్తి రాకేష్, బండ కృష్ణ
ప్రవీణ్ పాల్గొన్నారు.