రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
మచిలీపట్నం : నగరంలో నూతనంగా రూపుదిద్దుకున్న యర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్కును రాష్ట్ర పురపాలన పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ప్రారంభోత్సవం చేశారు. బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇంచార్జి యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టుబాబు), దివంగత యర్రా నాగేశ్వరరావు తనయుడు యర్రా సుబ్బారావులతో కలిసి 46వ డివిజన్, పంచాయితీ రాజ్ ఎంప్లాయిస్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, అమృత్, మున్సిపల్ కార్పొరేషన్ నిధులు రూ.2.18 కోట్లతో సకల వసతులతో రూపుదిద్దుకున్న యర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్కును ప్రారంభించారు. పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత యర్రా నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె ఆవరణలో మొక్కను నాటారు. సువిశాలమైన స్థలంలో నిర్మించిన పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, సేద తీరేందుకు కుర్చీ బల్లలు, వివిధ రకాల మొక్కల ఏర్పాటు వంటి సకల సౌకర్యాలతో ఆహ్లాదకరంగా పార్కును తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా కుటుంబానికి మచిలీపట్నం నగరానికి అవినాభావ సంబంధం ఉందని, నాన్న విద్యాభ్యాసం మచిలీపట్నం లోని హిందూ ఉన్నత పాఠశాల, హిందూ కళాశాలలో సాగిందని తెలిపారు. ఇండియన్ రైల్వేలో ఐ ఆర్ ఎస్ ఈ గా రిటైర్ అయ్యారని, కుటుంబంలో ఆయన ఎప్పుడూ కూడా మచిలీపట్నం గురించే మాట్లాడేవారని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎకరంన్నర స్థలంలో మా తండ్రి జ్ఞాపకార్థం ఈ పార్కును నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని తెలుపుతూ ఈ పార్కు నిర్వహణకు అయ్యే ఖర్చును తామే భరించనున్నట్లుగా తెలిపారు. స్థానిక ప్రజలందరూ ఈ పార్కును సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత నగరానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు పేర్ని నాని, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, యువ నాయకుడు పేర్ని కిట్టుబాబు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండి బి.రాజశేఖరరెడ్డి, నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మీ, శీలం భారతి నాగ కుసుమ రాణి, ముడా చైర్మన్ బొర్రా కనకదుర్గ నాగలక్ష్మీ భవాని, ముడా వీసీ కె.రాజ్యలక్ష్మీ, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ జి.చంద్రయ్య, బందరు ఆర్డిఓ ఎం.వాణీ, తహసిల్దార్ శ్రీవిద్య, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్ దాదా, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.