ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 60 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రజల ఆశీర్వాదాన్ని
అందిపుచ్చుకుని సెంట్రల్లో ముమ్మరంగా రహదారుల పనులు చేపడుతున్నట్లు ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 33 వ
డివిజన్ సత్యనారాయణపురంలో రూ. 60 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో
కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం హయాంలో డివిజన్లోని
రోడ్లు కనీసం తట్టెడు మట్టికి కూడా నోచుకోలేదని మల్లాది విష్ణు విమర్శించారు.
కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిలలోనూ తెలుగుదేశం
ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని
ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యనారాయణపురాన్ని ఆదర్శంగా
తీర్చిదిద్దుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. నాలుగేళ్లలో రూ. కోటి 36
లక్షల నిధులతో డివిజన్లో 1.36 కి.మీ. మేర రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు
వెల్లడించారు. గడపగడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో
పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడాన్ని గుర్తించడం జరిగిందని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. నూతన రహదారుల నిర్మాణంతో ఈ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత
పరిష్కారం లభించిందన్నారు. ఇప్పటివరకు 11 వీధులలో రోడ్ల నిర్మాణాలను
పూర్తిచేసుకోగా.. వ్యాకరణం వారి వీధి, రామమందిరం వీధి, వందనపు వారి వీధులలో
రహదారుల పనులకు శంకుస్థాపనలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మరో పాతికేళ్ల
వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పనులు చేస్తున్నట్లు చెప్పారు.
స్కూల్లో రూ. 2.56 కోట్ల నిధులతో చేపట్టిన నాడు-నేడు పనులు శరవేగంగా
జరుగుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆంధ్రరత్న పార్కును సైతం రూ. 14 లక్షల
నిధులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 90 ఏళ్ల ఘన చరిత్ర
కలిగిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ఈ ప్రభుత్వంలోనే
రూ. 70 లక్షల కామన్ గుడ్ ఫండ్ నిధులు విడుదలైనట్లు మల్లాది విష్ణు
గుర్తుచేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో శ్రీ వాసవి
కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నట్లు తెలియజేశారు. అదే
తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా యూజీడీకి సంబంధించి ఒక
సంపు నిర్మించాలనే కనీస ఆలోచన చేయలేకపోయినందుకు గత పాలకులు సిగ్గుపడాలని
మల్లాది విష్ణు అన్నారు. పరిపాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి
మరెవరూ సాటిరారని.. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంజలో నిలపడమే
తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి
శ్రీనివాస్, నాయకులు శనగవరపు శ్రీనివాస్, లంకా బాబు, కమ్మిలి రత్న, ఉప్పు
రంగబాబు, మైలవరపు రాము, నాళం బంగారి, కొల్లూరు రామకృష్ణ, ఎం.శ్రీను,
టి.గోపాలకృష్ణ, కొప్పరపు మారుతి, చల్లాప్రగఢ గోపాలకృష్ణ, కృష్ణమోహన్, నాడార్స్
శ్రీను, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.