గుంటూరు : తోడేళ్ల మందకు నాయకుడుగా చంద్రబాబు ఉన్నారని, బాబు ఉచ్చులో
కమ్యూనిస్టులు, బీజేపీ, ఇతర పార్టీల నేతలు పడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి
అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
మాట్లాడారు. న్యాయ రాజధాని కర్నూలులో ఉండాలన్న బీజేపీ
ఇప్పుడేమో అన్నీ అమరావతిలోనే ఉండాలనడం ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రపంచం
ఆమోదించిన వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, బాబు లక్షల కోట్ల
భూకుంభకోణాలపై స్పందన ఏదని నిలదీశారు.
మీడియా మీట్లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్ష రోజులైనా
‘కృతిమమే’ అని అన్నారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదు. కొందరు
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బాబు బినామీలు ఆశించిన అవినీతి కుంభకోణం సఫలం
కాలేదు. దీంతో ఒక కృతిమ ఉద్యమం నడుపుతున్నారు. ఈ విషయాన్ని మేము ముందు నుంచే
చెబుతున్నాం. అమరావతి–అరసవెల్లి పాదయాత్ర మధ్యలోనే తోక ముడవడంతో అది
రుజువైంది. వాస్తవానికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులంతా వాళ్ల మిగిలిన
భూములు కూడా ఎప్పుడో అమ్మేసుకున్నారు. ఇంకొందరు తమకు వచ్చిన ప్లాట్లు కూడా
అమ్మేసుకుని వేరే చోట భూములు కొనుక్కున్నారు. చంద్రబాబు చూపిన గ్రాఫిక్స్‌లో
రాజధాని అమరావతి చూసి వ్యాపారం కోసం భూములు కొన్న వారే ఈ కృతిమ ఉద్యమంలో
పాల్గొంటున్నారు. అదంతా చంద్రబాబు రాజకీయం. అది 1200 రోజులైందని కాదు. ఒక
ఆర్గనైజ్డ్గా 200 మందో, లేక 500 మందితోనో లక్ష రోజులు కూడా జరుపుకోవచ్చు.
అలా మాట్లాడితే ప్రతిఘటన సహజమే : అమరావతి ప్రాంతంలో ఈరోజు దాడులు జరిగాయనడంలో
అర్ధం లేదు. అసలు, అక్కడ దాడులు జరగాల్సిన పనేంటి? చంద్రబాబు రాజకీయ కుట్రలో
భాగంగా, రెచ్చగొట్టడం వల్ల అక్కడ జరిగే కృతిమ ఉద్యమాలకు వచ్చిన పార్టీల
నాయకులు ఇష్టానుసారం బూతులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడే నేతల్ని
కట్టడి చేయడానికి అభ్యంతరపెట్టిన వారిపై దౌర్జన్యం చేయడం, మరలా తిరిగి తమపైనే
దాడి చేశారంటూ బాబు, ఆయన బినామీలు నానా యాగీ చేస్తున్నారు. అందులో భాగంగానే
ఈరోజు దాడులంటూ విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే మమ్మల్ని
ఎలా నిలదీస్తారంటూ బాబు, ఆయన కొడుకు వ్యవహరిస్తున్న సంగతి అందరూ చూస్తూనే
ఉన్నారు.