సర్వ మానవాళి సంక్షేమం కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు
విజయవాడ : మత సామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్యధామం
అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా దర్గాకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం చాదర్ సమర్పించారు. వాంబే
కాలనీలోని ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం నిర్వాహకులు
అజ్మీర్ యాత్రకు వెళుతున్న నేపథ్యంలో ఆశ్రమం పెద్దలకు ఆంధ్రప్రభ కాలనీలోని తన
కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చాదర్ ను అందజేశారు. ఈ సందర్భంగా
ముస్లిం పెద్దలతో కలిసి సర్వ మానవాళి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు
చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ ఖాజా బాబా ఆశ్రమం 7 వ వార్షికోత్సవ
వేడుకలతో పాటు అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణకు ఆశ్రమ కమిటీ
ప్రతినిధులు అజ్మీర్ వెళ్తుండటం సంతోషదాయకమన్నారు. ముస్లిం మైనార్టీల
అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర
ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర
ప్రజల క్షేమం, సెంట్రల్ నియోజకవర్గ ప్రగతి కోసం పవిత్ర అజ్మీర్ దర్గాలో
ప్రత్యేక ప్రార్థనలు చేయవలసిందిగా మత పెద్దలను కోరారు. అనంతరం మల్లాది విష్ణు
గారిని మత పెద్దలు ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. 60వ డివిజన్
వాంబే కాలనీ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎండి ఇస్మాయిల్,
షేక్ బాబు, అఫ్రోజ్, ముస్తఫా, షేర్ అలీ, షేక్ రహీం, జలీల్ ఖాన్, గౌస్, వైసీపీ
నాయకులు బత్తుల దుర్గారావు, అలంపూరు విజయ్ కుమార్, దేవి రెడ్డి రమేష్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.