23 వ డివిజన్ 93, 97 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన
మూడున్నరేళ్ల కాలంలో నియోజకవర్గం 30 ఏళ్ల ప్రగతిని సాధించిందని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23 వ
డివిజన్ 93, 97 వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు,
కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. చలసాని వెంకట కృష్ణయ్య
వీధి, వేముల శ్యామలా దేవి రోడ్డు, చెరుకుపల్లి వారి వీధి, కాలేపు వారి వీధి,
రెహమాన్ పార్కు రోడ్డులో విస్తృతంగా పర్యటించి 133 ఇళ్లను సందర్శించారు.
ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారని మల్లాది
విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన
సంక్షేమ పథకాల బుక్ లెట్లను లబ్ధిదారులకు అందించారు. ఒక్కో కుటుంబానికి లక్ష
నుంచి అత్యధికంగా రూ. 5 లక్షల వరకు లబ్ధి చేకూరినట్లు వివరించారు. స్థానికంగా
ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తెలియజేయాలని కోరారు. కాలేపు వారి వీధిలో నూతన
రహదారి నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు
సూచించారు. అలాగే చెత్త సేకరణ ప్రతి ఇంటి వద్ద జరగాలని వీఎంసీ సిబ్బందిని
ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రజలను మోసగించే పార్టీ టీడీపీ
ప్రజలను నిరంతం మోసం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా
ప్రజలను మభ్యపెట్టే పనులను చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇంటికో
ఉద్యోగం పేరుతో అధికారంలోకి వచ్చిన బాబు ఐదేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ
చేయలేకపోయారని ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన
మూడున్నరేళ్లలో ఒక విప్లవంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.
నేరుగా 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు.. ఆప్కాస్ ద్వారా 95 వేల
మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీకి చెందిన దాదాపు
52 వేల మంది ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రభుత్వ రంగంలో మాత్రమే కాకుండా ప్రైవేటు రంగంలోనూ జాబ్ మేళాల ద్వారా యువతకు
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ
నిరుద్యోగిగా మిగలకూడదనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే.. కనీస అవగాహన
లేకుండా నారాలోకేష్ మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. నిజంగా
చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం హయాంలో యువతకు ఎన్ని ఉద్యోగావకాశాలు కల్పించారో
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగానీ మాయ మాటలతో మోసగించే
చర్యలను మానుకోవాలని హితవు పలికారు. నారాలోకేష్ ఎన్ని యాత్రలు చేసినా,
పొర్లుదండాలు పెట్టినా 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని
స్పష్టం చేశారు.