న్యూఢిల్లీ : మెకానిక్‌లు సాధికారత సాధిస్తేనే దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ
బలోపేతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ
లోని కరోల్‌బాగ్‌లో గత నెల 27న మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో తాను
ముచ్చటించినప్పటి వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పంచుకున్నారు.
కరోల్‌బాగ్‌లో తన పర్యటన విశేషాలను ఈ సందర్భంగా వివరించారు. ద్విచక్రవాహనం
సర్వీసింగ్‌లో నైపుణ్యాలను అక్కడ నేర్చుకున్నానని చెప్పారు. తనకు కేటీఎమ్
బైక్ ఉందని, భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో అది పార్కింగుకే పరిమితమైందని
అన్నారు. పెళ్లెప్పుడు చేసుకుంటారని రాహుల్‌ను ఓ మెకానిక్ ప్రశ్నించగా
‘చూద్దాం’ అంటూ బదులిచ్చారు. మెకానిక్‌లు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
కష్టపడుతున్నారు. నిజాయతీగా సంభాషించి వారి కష్టాలను తెలుసుకునేందుకు
ప్రయత్నించా. మెరుగైన సౌకర్యాలు పొందడానికి వారు అర్హులు. కార్మికుల
శ్రేయస్సులోనే దేశ నిజమైన పురోగతి దాగి ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.