మేం కలిసి వున్నట్లు జగన్ మైండ్ గేం ఆడుతున్నాడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
విజయవాడ : వైసీపీ అవినీతిపై బీజేపీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందని, ఏనాడూ
వైసీపీని సమర్దించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర
హోంమత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇటీవల విశాఖ,
శ్రీకాళహస్తి బహిరంగసభల్లో వైసీపీ పై చేసిన విమర్శలు, ఆరోపణలపై బీజేపీ
స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. బీజేపీ ఇప్పుడు కొత్తగా మాట్లాడటం లేదుని
ప్రభుత్వ వైఫల్యాలపై మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. అలాగే
ముఖ్యమంత్రి జగన్‌ను బీజేపీ ఎప్పుడూ సమర్ధించలేదన్నారు. ఖాళీ ఉద్యోగాలను
భర్తీ చేయకపోవడంపై యువమోర్చా ఉద్యమం చేపడితే కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్
వచ్చి వైసీపీ మద్యం మాఫియాపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. జేపీ
నడ్డా జూన్‌లో విజయవాడ, రాజమండ్రిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా
విమర్శించారన్నారు. అలాగే ప్రకాష్ జవదేకర్ కూడా జగన్ అవినీతిపై స్పందించి
జైలుకు వెళ్లే అవకాశం ఉందని విమర్శించారు.
వైసీపీ మొదటి నుంచి మత వివక్ష కొనసాగిస్తోంది. హిందూధర్మంపై దాడులు జరిగితే
ఉపేక్షించి నిందితులను వెనకేసుకొచ్చింది. రామతీర్ధం ఘటనపై భాజపా పెద్ద ఎత్తున
ఉద్యమం చేసిందన్నారు. ఇక శ్రీకాళహస్తిలో నడ్జాజీ, విశాఖలో అమిత్‌షాలు తీవ్రంగా
ప్రభుత్వ దోపిడి, కుంభకోణాలపై స్పందించి విమర్శించారని చెప్పారు. కానీ వైసీపీ
దురుద్దేశంతో బీజేపీని బురదజల్లాలని చూస్తోందని చెప్పారు. వైసీపీతో తో
ఇప్పటి వరకు బీజేపీ కలసి ఉన్నట్లు, ఇక ఉండదేమో అనే అనుమానాన్ని ముఖ్యమంత్రి
జగన్ వ్యక్తం చేయడం వ్యూహంతో కూడిన వంచనగా పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు మీతో
ఉందో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీకి సహకరించని
కారణంగా అభ్యంతరకరమైన సంబోధనతో పవన్ కల్యాణ్‌ను జగన్ విమర్శించడంతో ఆ
పార్టీతో చెలిమి చేస్తున్న పార్టీగా బీజేపీ , జగన్‌ను విమర్శిస్తోందన్నారు.
పవన్‌పై ఆ రకమైన పదప్రయోగాలు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ఇంకా ఆయన
ఇలా అన్నారు.
కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుంటూ వాటిని దారి మళ్లించుకుంటూ మజా
చేసే వైసీపీ , మేం విమర్శించినపుడు ఎదురు మాట్లాడక ప్రజల్ని ఏమార్చేలా జగన్
వ్యూహం అమలుచేస్తున్నాడు. ఇసుక అక్రమ ఆమ్మయాలు, థర్మల్ పవర్ కర్మాగారం నుంచి
వచ్చే బూడిద అమ్మకాలు, లాండ్ మాఫియా, మద్యం మాఫియాపై భాజపా మొదటి నుంచీ
ఉద్యమాలు చేస్తోంది. మేం ఎన్నో సార్లు ప్రభత్వ అవినీతిని బయటపెట్టి బహిరంగ
చర్చకు రమ్మని సవాల్ విసిరితే దానికి ఒక్క వైసీపీ నాయకుడూ స్పందించలేదు. ఎపీ
అభివృద్ధికి 8,16,000 లక్షల కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం విభజన బిల్లులో
లేని పది సంస్థలను కూడా ఏర్పాటుచేసింది. కాని రాష్ట్ర అవినీతిపై బీజేపీ
విమర్శించినప్పుడల్లా వైసీపీ నాయకులు ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వంటి వాటిని
గుర్తుచేస్తున్నారు. జగన్, పేర్ని నాని పొంతన లేకుండా తలో మాట
మాట్లాడుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ
పట్టించే విధంగా ఉన్నాయి. ఈ మైండ్ గేమ్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
మీ అవినీతిని వ్యతిరేకించే పార్టీ బీజేపీ ఒక్కటి మాత్రమే అన్నారు. కేంద్ర
ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరెందుకు కనీసం ఒక్క పని
చేయలేకపోతున్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపనీ చేయలేదు.
మీ చేసినపనులపై పుస్తకం ప్రచురించాం. దమ్ముంటే డిబేట్‌కు రండి. తొమ్మిదేళ్ళ
పాలనలో ఏపీకి ఏం చేశామో బ్రోచర్ విడుదల చేశాం. ఈ నెల 20 నుంచి ఇంటింటికి
వెళ్లి బీజేపీ ఎపీకి చేసిన సహాయంపై ప్రచారం చేస్తాం. 45 వేల పోలింగ్
బూత్‌లకు కిట్లు ఇస్తాం. లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి ప్రచారం
చేస్తామన్నారు.