విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో తయారైన కియా కారెన్స్ కార్ కు కార్ ఆఫ్ ద ఇయర్-2023
అవార్డు లభించడం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని రాజ్యసభ
సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా శుక్రవారం పలు అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో
అనంతపురంలో స్థాపించిన కియా 2019లో 57719 యూనిట్లు ఉత్పత్తి చేయగా 2021లో 2.27
లక్షలకు చేరిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్న కియా కార్లు
ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు.
అంబేద్కర్ స్మృతివనం సిద్ధం
విజయవాడ స్వరాజ్ మైదానం లో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు చివరి
దశకు చేరుకున్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బీఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా స్మృతివనంలో 125 అడుగుల ఎత్తుగల ఆయన కంచు
లోహ విగ్రహం ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుపేదల,
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్రప్రభుత్వ నిబద్ధతకు ఇది
నిదర్శనమని అన్నారు.
పరిశోధన అభివృద్దిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి
దేశంలో పరిశోధన అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)ని పెద్ద ఎత్తున
ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి
(జీడీపీ)లో కనీసం ఒక్కశాతం కూడా పరిశోధన అభివృద్దిపై మనదేశంలో ఖర్చు చేయడం
లేదని తెలిపారు. దక్షిణ తూర్పు ప్రాంత దేశాలు వాటి స్థూల జాతీయ ఉత్పత్తిలో
పరిశోధన అభివృద్దిపై 3 శాతం ఖర్చు చేస్తున్నాయని, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్
దేశాలు 4.5% నుంచి 5 శాతం వరకు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర
ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని పరిశోధన, అభివృద్దిపై పెట్టుబడులను
కూడా పెంచాలని అన్నారు.