విజయవాడ సెంట్రల్ : దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ జింఖానా మైదానం నందు ముస్లిం
సోదరులతో కలిసి గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతదేశ చరిత్రలో
ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు ఇంతటి గుర్తింపు లేదని మల్లాది విష్ణు అన్నారు.
ముస్లింల అభ్యున్నతికి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం
జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలిచారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి
వైఎస్సార్ అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లతో ఈ రోజున రాష్ట్రంలో ముస్లింలందరూ
విద్య, వైద్య రంగాల్లో రాణించి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. మరలా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనార్టీ
యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక నిధులు
కేటాయించి ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. గత
తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలను పట్టించుకున్న పాపానపోలేదని.. గతంతో పోలిస్తే
మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మల్లాది
విష్ణు అన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం
ఖర్చుచేసింది కేవలం రూ. 2,665 కోట్లు.. కాగా ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో
60,54,839 మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా రూ. 20 వేల కోట్లకు పైగా లబ్ది
చేకూర్చినట్లు వివరించారు. అలాగే ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్
రూపొందించిన ఏకైక రాష్ట్రం మనదేనని మల్లాది విష్ణు అన్నారు. ఇమామ్‌లు,
మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే ఈ ప్రభుత్వం ఆ బకాయిలు
చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని అందిస్తోందన్నారు. ఉర్దూ భాషకు గుర్తింపు
తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక
చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందని చెప్పుకొచ్చారు.
అటువంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో
మైనార్టీ సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.