విజయవాడ : భారత ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ తుదిశ్వాస
విడిచిన సంగతి తెలిసిందే. వందేళ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె అహ్మదాబాద్
లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె
ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె మృతి చెందారు. ఈ సందర్భంగా
మోడీకి ప్రముఖులు సానుభూతిని తెలిపారు.
మోడీ గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోడీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు.
హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు.
తల్లిని కోల్పోవడం ఎవరికైనా అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు
చెప్పారు. మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోడీ కుటుంబానికి భగవంతుడు
ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు.
హీరాబెన్ మోడీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.