ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నాం
రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : తొలి రోజు నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్న ప్రధాని నరేంద్ర
మోడీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారని రాష్ట్ర మంత్రి,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని వరంగల్
పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. అక్కడ జరిగే ఏ కార్యక్రమంలోనూ
పాల్గొనబోమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గుజరాత్‌లోని దహోద్‌లో రూ.20వేల కోట్లతో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటు చేశారని,
తెలంగాణలో మాత్రం తూతూ మంత్రంగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. బిచ్చంలాగా
రూ.520 కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి
రోజు నుంచి మోదీ తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్నారని, రాష్ట్రం పట్ల ఆయనకు
ఎందుకంత వ్యతిరేకతో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్ర పునర్విభజన హామీల్లో
ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మొండి చేయి చూపారని, ప్రధాని బూటకపు మాటలు
నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఇదే వరంగల్ జిల్లాకు
ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చలేదని, మహబూబాబాద్ జిల్లాలో
బయ్యారం ఉక్కు కర్మాగారం పెడతామని మోసం చేసిన మోడీ ఏ ముఖం పెట్టుకొని
వస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. ‘తల్లిని చంపి బిడ్డను వేరుచేశారు’ అన్న
ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరని, మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన
బీజేపీని ఎవరూ నమ్మరని చెప్పారు. ప్రధాని వరంగల్ పర్యటనను
బహిష్కరిస్తున్నామని, తమ పార్టీ నేతలెవరూ అందులో పాల్గొనరని స్పష్టం చేశారు.
జాతీయ కూటములు మాటల్లోనే ఉంటున్నాయని.. చేతల్లో కుదరదని అభిప్రాయపడ్డారు.
మోదీకి తలవంచకుండా పోరాటం చేసే వ్యక్తి కేసీఆర్ అని, ఆ విషయం దేశ ప్రజలకూ
తెలిసిందని చెప్పారు.
ఏ హోదాలో రాహుల్ హామీ ఇచ్చారు? : ‘‘కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీకి ఏ
హోదా ఉంది? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు. ఎంపీ కూడా కాదు. రూ.4వేల పింఛన్‌ను
ఆయన ఏ హోదాలో ప్రకటించారో చెప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎటువంటి
హోదా లేని నాయకులిచ్చిన హామీలను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరన్నారు. దేశ
ప్రజలు రాహుల్ గాంధీని లీడర్‌గా గుర్తించడం లేదని చెప్పారు. 55 ఏళ్ల పాటు
తెలంగాణను వేధించుకుతిన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు
తెలుసన్నారు. పాత రాబందులు ఇప్పుడు వివిధ వేషాల్లో వచ్చినంత మాత్రాన ఇక్కడి
జనం నమ్మరని పేర్కొన్నారు. నాలుగేళ్ల కిందట ప్రధాని మోదీని బూతులు తిట్టిన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఎన్డీయే సమావేశంలో ఎలా పాల్గొంటారని
కేటీఆర్ ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఏపీ, తెలంగాణకు మోదీ చేసిన
మేలేంటో చెప్పిన తర్వాతే చంద్రబాబు ఆ సమావేశానికి హాజరుకావాలని డిమాండ్
చేశారు.
కాంగ్రెసే విదేశీ చేతుల్లో ఉంది : ధరణి విదేశీయుల చేతిలో ఉందన్న రేవంత్‌రెడ్డి
వ్యాఖ్యలు హాస్యాస్పదమని, కాంగ్రెస్ పార్టీనే విదేశీ చేతుల్లోనే ఉందన్న
విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ధరణి వల్ల భూ దందాలు
ఆగిపోయాయన్న అక్కసుతోనే ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు. రేవంత్ నోట్లో నుంచి
రూ.వేల కోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని, మతిస్థిమితం లేకనే.. ఆయన అసంబద్ధ
ఆరోపణలు చేస్తుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన వందశాతం ఆరెస్సెస్,
బీజేపీ మనిషి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కుతోనే కరీంనగర్
పార్లమెంటు స్థానంలో గెలిచారని కేటీఆర్ ఆరోపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో
జరిగిన దుబ్బాక, నాగార్జున్‌సాగర్, హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లోనూ
కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మహాకూటమి
పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలు వీపు పగలగొట్టిన విషయాన్ని కూటమి
పార్టీలు గుర్తుంచుకోవాలన్నారు. పేదవారి గుండెల్లో కేసీఆర్ ఉన్నారని,
మూడోసారీ ఆయన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జగదీశ్, సాయిచంద్ కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున సాయం
బీఆర్ఎస్ యువ నాయకులు కుసుమ జగదీశ్, సాయిచంద్ల అకాల మరణం ఎంతో కలచి
వేసిందని కేటీఆర్ అన్నారు. వారి కుటుంబ యోగక్షేమాల కోసం ఒక్కో కుటుంబానికి
రూ.కోటిన్నర చొప్పున ఆర్థిక చేయూత అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇందుకుగాను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా
ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం నుంచి రూ.3 కోట్లను ఆ రెండు కుటుంబాలకు ఇవ్వాలని
నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జగదీశ్, సాయిచంద్ తల్లిదండ్రులు, పిల్లలకు
ఉపయోగపడేలా వారి పేరిట రూ.25లక్షల చొప్పున డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు.