వాంబే కాలనీ లో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లో పాల్గొన్న కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్
హైదరబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థ పరిపాలన ఫలితంగానే బలమైన 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నేడు దేశం నిలిచిందని, అతి త్వరలో 3 వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ అన్నారు. బీమా మైదాన్, వాంబే కాలనీ లో జరిగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్ల పాలనలో భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా అవతరించిందని, దేశ ఆర్థిక పరిస్థితి మారుతోందని, దాని ప్రతిఫలం ప్రతీ పేదవాడికి చేరువవ్వాలన్నారు.కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సమాచార డిజిటల్ వాహనాన్ని వీక్షించారు.కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, లబ్ధిదారుల విజయగాథను ‘వికసిత భారత్ సంకల్ప యాత్ర’ చెబుతోంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు పథకం ప్రయోజనాలను పొందని వారికి అందజేయడమే ఈ డిజిటల్ వాహనం ఉద్దేశమని ఆయన తెలియజేశారు. 80 కోట్ల మందికి ప్రతీ నెలా 5 కిలోల బియ్యం 5 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని, చిన్న వ్యాపారాలు చేసే వారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం సులభతరం చేసింది మోదీ ప్రభుత్వం.వీధి వర్తకులకు పిఎం స్వానిధి ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఉన్నతికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సోదరి మణులు కష్ట పడకుండా ఉండాలని పి ఎం ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం ప్రధాన మంత్రి కల్పించారన్నారు.
గతం లో మన దేశం పై ఎవరైనా దాడి చేస్తే మనం మౌనంగా ఉండే వాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారి దేశాలలోకి చొచ్చుకుపోయి మరీ దాడి చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రతి పథకం ప్రతీ ఇంటికి చేరుకోవాలనే లక్ష్యం తో మోదీ గ్యారంటీ వ్యాన్ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా అందరికీ చేరుకుంటుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు లభిస్తుందని, వివిధ కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇల్లు లభించని వారికి సొంతింటి కల నెరవేరేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి అన్నారు. వాంబే కాలనీ లో ప్రస్తుతం ఉన్న నిర్మాణాల మరమ్మత్తులకు సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రి తో మాట్లాడినట్లు, త్వరలోనే మరమ్మత్తు లు పూర్తయ్యేలా చూస్తానని మంత్రి తెలిపారు.
అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ సమాచారంతో కూడిన ఐఈసీ మెటిరియల్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన స్టాళ్లను సందర్శించారు. వివిధ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మరియు ప్రజలు నేరుగా వాటి నుండి లబ్ధి పొందేందుకు ఈ స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు.