న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 10 అంశాలు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ రూపంలో బీజేపీకి బలమైన అవకాశాలున్నాయి. 2001-2014 మధ్య సీఎంగా పనిచేసిన మోదీ రాష్ర్టాన్ని వీడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఆయన పట్టు చెక్కుచెదరలేదు. తాజా ఎన్నికల్లో కూడా మోదీనే అతిపెద్ద నిర్ణయాంశం కానున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. మోర్బీలో తీగల వంతెన కూలి 135 మంది చనిపోయిన ఘటన కూడా ఈ ఎన్నికల్లో అధిక ప్రభావాన్నే చూపనుంది. ముఖ్యంగా పాలనా యంత్రాంగం, వ్యాపారవేత్తల మధ్య అనుబంధాన్ని ఈ ఘటన తేటతెల్లం చేసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఘటన తీవ్రంగా ప్రభా వం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. బిల్కిస్ బానొపై అత్యాచారానికి పాల్పడిన దోషులను శిక్ష తగ్గించి జైలు నుంచి విడుదల అంశం కూడా ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత : రాష్ట్రంలో గత 24 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ పాలనపై సమాజంలో అసంతృప్తి బాగా పెరిగిపోయిందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. 1998 నుంచి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. సుదీర్ఘ పాలనలోనూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు భావిస్తున్నారు. అధిక విద్యుత్ చార్జీల అంశం కూడా ప్రభావం చూపనుంది. దేశంలోనే అత్యధిక విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రం గుజరాత్. వాణిజ్య అవసరాలకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ ఇటీవలే డిమాండ్ చేసింది. మహారాష్ట్ర, తెలంగాణల్లో పరిశ్రమలకు యూనిట్ రూ.4కే ఇస్తున్నా, గుజరాత్లో మాత్రం రూ.7.50 వసూలు చేస్తున్నారని పేర్కొంది. అధ్వాన రోడ్ల అంశం కూడా గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. గత ఐదారేళ్లుగా రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణ కూడా చేపట్టలేకపోయారు. ప్రశ్నపత్రాలు లీక్, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా ఘటనలు ప్రభావం చూపనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు లేకపోవడం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. గత రెండేళ్లుగా అధిక వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు బలవంతంగా భూసేకరణను కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ వచ్చేనెలలో జరిగే ఎన్నికల్లో. కీలకాంశాలు కానున్నాయి.