విజయవాడ : రాహుల్ గాంధీ విషయంలో మోదీ వ్యవహారశైలి దుర్మార్గమని కక్ష సాధింపు
చర్యలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పు
పడుతున్నారని, అదానీ, మోడీల బంధం నిజం కాదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. అదానీ, అంబానీ దోపిడీకి నిరసనగా
ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పోస్ట్ కార్డు ఉద్యమం మంగళవారంనాడు
ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. విజయవాడ అల్లూరి
సీతారామరాజు విగ్రహం దగ్గరలోని గులాబీ తోటలో జరిగిన నిరసన కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ సభ్యులు,
ఏపీ వ్యవహారాల బాధ్యులు సి.డి.మెయ్యప్పన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ
సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, ప్రపంచ ధనికుల్లో రెండో స్థానంలోకి
అదానీ ఎలా వచ్చారని ప్రశ్నించారు. మోడీ విదేశీ పర్యటనలకు అదానీ సౌకర్యాలు
సమకూర్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మోడీ అక్రమాలను ప్రశ్నించే
వారిపై వ్యవస్థలతో దాడి చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో
ఏఐసీసీ కార్యదర్శి జెడి శీలం, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర
పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, గుంటూరు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ లింగంశెట్టి
ఈశ్వరరావు, మదన మోహన్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్, వి.గురునాధం, ఖాజా
మొహినుద్దిన్, వేముల శ్రీనివాస్, అమృత తేజ్, వీరేష్, శ్రీకాంత్, మహేష్, విజయ్,
జనార్ధన్, జంద్యాల శాస్త్రి, ఖుర్షీద్, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.