వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు
యాంటీబయొటిక్స్ అనధికారిక విక్రయాలకు కళ్లెం వేసేందుకు చర్యలు
భావితరాలను రక్షించుకునేందుకు ఎఎంఆర్ ను కట్టడి చేయాల్సిందే
అమరావతి : యాంటి బయాటిక్స్ విచ్చలవిడి వినియోగం ప్రాణాంతకంగా మారుతోందని
వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలకు భారంగా మారుతున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎంఆర్)
కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విజయవాడలో జరుగుతున్న
రెండురోజుల వర్క్ షాప్ లో ఆయన శనివారం పాల్గొని మాట్లాడుతూ ఎఎంఆర్ ఇప్పుడు
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన అంశంగా మారిందన్నారు. ఎఎంఆర్ కట్టడికి కేంద్ర
ప్రభుత్వం ఇప్పటికే జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, దీని ఆధారంగా
రాష్ట్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ వర్క్ షాప్ లో
చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి ఈ రంగంలో పనిచేస్తున్న
వివిధ సంస్థలు, ప్రభుత్వంలోని పశు సంవర్ధక శాఖ, ఫార్మాస్యూటికల్, వైద్య ఆరోగ్య
కుటుంబ సంక్షేమ శాఖ వంటి వివిధ విభాగాల నుండి సమాచారాన్ని
సేకరిస్తున్నామన్నారు.
ఈ సమాచారం ఆధారంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు
ముందడుగు వేస్తామని చెప్పారు. మానవ శరీరంలో వ్యాధి నిరోధకతకు సహకరించే యాంటీ
బయొటిక్స్ అభివృద్ధి చేసేందుకు కొనసాగిస్తున్న పరిశోధనలకు దీర్ఘకాలం పట్టటంతో
పాటు భారీ వ్యయమవుతుందన్నారు. ఆరోగ్య సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కోసం
డాక్టర్లు సూచిస్తున్న
యాంటీ బయాటిక్స్ వినియోగం శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతోందన్న
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆయన అన్నారు. సాధారణ యాంటీ బయొటిక్స్
వ్యాధికారక బాక్టీరియాను అదుపు చేయటంలో అనేక సందర్భాలలో విఫలమవుతుండటంతో,
నాణ్యత పేరుతో అత్యంత ఖరీదైన యాంటీ బయాటిక్స్ వైపు మొగ్గు చూపాల్సిన
పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
ప్రస్తుత పేటెంట్ల యుగంలో భారీగా పెరిగిన వైద్య పరిశోధనల వ్యయం, ఔషధ తయారీ
వ్యయం వంటి అంశాలతో యాంటీ బయాటిక్స్ ధర తడిసి మోపెడవుతోందని ఆందోళన వ్యక్తం
చేశారు. ఈ యాంటీ బయాటిక్స్ వినియోగం పేదలపై ఆర్థిక భారాన్ని మోపటంతో పాటు
వైద్య వ్యయాన్ని కూడా పెంచుతుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన
అభిప్రాయపడ్డారు. ఈ ధరాభారంతో సామాన్యుడు నలిగి పోతున్నాడని ఆందోళన
వ్యక్తంచేశారు. తాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో
తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్ లో
పర్యటిస్తున్న ఐరోపా దేశాల ప్రతినిధి బృందం విశాఖ పోర్ట్ ఫిషింగ్ హార్బర్
పరిశీలనకు వచ్చిందని వివరించారు. ఆ సమయంలో వారు ఒక ఆక్వాఫార్మ్ పరిశీలనకు
వెళ్తున్నపుడు దారిలో ఒక మందుల షాపు వద్ద జరిగిన సంఘటన వారిని ఆకర్షించిందని
చెప్పారు. ఆ మందుల షాపు వద్ద ఒక వ్యక్తి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే
యాంటీ బయాటిక్స్ కొనుగోలు చేస్తుండటంపై ఐరోపా ప్రతినిధి బృందం విస్మయం
వ్యక్తం చేసిందని వివరించారు. తరువాత వారు ఆ మెడికల్ షాపు యజమానిని అడిగి
అందుకు సంబంధించిన వివరాలు సేకరించారన్నారు.
అర్హుడైన వైద్య నిపుణుడి నుండి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కేవలం
నోటిమాట, సాధారణ చీటీల ఆధారంగా యాంటీ బయాటిక్స్ ను ఎటువంటి రసీదులు లేకుండానే
విక్రయిస్తుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు. ఇలా విచ్చలవిడిగా
యాంటీ బయాటిక్స్ ను వినియోగించటం కారణంగా వ్యాధికారక బాక్టీరియాలు వాటిని
ప్రతిఘటించే శక్తిని పెంచుకోవటం ఎఎంఆర్ పెరుగుదలకు దారి తీస్తోందని కృష్ణబాబు
చెప్పారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఇటువంటి పరిస్థితులను మార్చేందుకే తాము
ఫార్మారంగాన్ని డిజిటల్ బాట పట్టించామని, ప్రతి ప్రిస్క్రిప్షన్, ప్రతి
విక్రయం అధికారికంగా నమోదయినపుడు విచ్చలవిడి వాడకానికి చెక్‌పెట్టవచ్చని
భావించామని ఆయన చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ప్రతి ఫార్మా కంపెనీ వారి
సొంత సాప్ట్ వేర్ వినియోగించుకోవటం పలు సమస్యలకు దారి తీస్తోందన్నారు. ఈ
సమస్యకు పరిష్కారంగానే ఉమ్మడి సాఫ్ట్ వేర్ ను ఫార్మా రంగానికి అందించేందుకు
చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
శరీరారోగ్యానికి ఏ చిన్న సమస్య ఏర్పడినా దానికి తక్షణ పరిష్కారాన్ని ప్రతి
ఒక్కరూ కోరుకుంటుండటం వల్లే యాంటీ బయాటిక్స్ వాడకం విపరీతంగా
పెరిగిపోతోందన్నారు. యాంటీ బయాటిక్స్ ను చివరి ప్రయత్నంగా ‘బ్రహ్మాస్త్రం’
తరహాలో మాత్రమే ఉపయోగించాలని, అప్పుడు ఎఎంఆర్ పెరుగుదలకు కళ్లెం వేయగలుగుతామని
ఆయన స్పష్టం చేశారు. ఎఎంఆర్ కట్టడి కార్యాచరణ ప్రణాళికను ప్రయోగాత్మకంగా
అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాను ఎంపిక
చేసిందని, గత నాలుగేళ్లు అమలులో వున్న ఈకార్యాచరణ ప్రణాళిక ఫలితాలను
సమీక్షించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామని ఆయన చెప్పారు.
మన తరాన్ని, మన భావితరాలను రక్షించుకోవటం కోసం ఈ ప్రణాళికను కట్టుదిట్టంగా
అమలు చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ఎంఎఆర్పై అవగాహన కల్పించేందుకు కృషి
చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా), ఇన్ఫెక్షన్
కంట్రోల్ ఆఫ్ ఇండియా (ఇఫ్కాయ్), వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ (డబ్ల్యుఎపి) వంటి
అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వర్క్ షాప్
నిర్వహించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్
కాల్ ఫర్ యాక్షన్’ పేరుతో రూపొందించిన నివేదికను కృష్ణబాబు ఈ సందర్భంగా
ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, ఎఎంఆర్ నోడల్ అధికారి జె.
నివాస్, వైద్య విద్యా శాఖ డైరెక్టర్ (డిఎంఇ) డాక్టర్ వినోద్ కుమార్, డ్రగ్
కంట్రోల్ డిజి రవిశంకర్ నారాయణ్, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొ.పల్లు
రెడ్డన్న, సెక్రెటరీ జనరల్ డాక్టర్ రత్నాకర్, ఇఫ్కాయ్ అధ్యక్షుడు డాక్టర్
రంగారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డాక్టర్
మోహన్ కృష్ణ, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ
మైక్రోబయాలజీ డాక్టర్ పి. ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఎఎంఆర్
యాక్షన్ ప్లాన్ల బలోపేతానికి సంబంధించిన ‘విజయవాడ డిక్లరేషన్’ విడుదల చేశారు.