తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌వన్
స్థానంలో నిలిచిందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
వెల్లడించారు. గురువారం వరకు రాష్ట్రంలోని 11 లక్షల మంది రైతుల నుంచి
రూ.13,383 కోట్ల విలువైన 65.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు
తెలిపారు. గతేడాది యాసంగితో పోలిస్తే ఈసారి 18 లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా
సేకరించామన్నారు. ఈ మేరకు మంత్రి ప్రకటన విడుదల చేశారు. ‘‘ముఖ్యమంత్రి
కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, అందుబాటులో
సమృద్ధిగా నీళ్లు వంటి రైతు అనుకూల విధానాలతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా
మారింది. యాసంగిలో రాష్ట్రంలో 56.845 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఈ
సీజన్లో అకాలవర్షాలు కురిసినా ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలవడంతో ధాన్యం
సేకరణలో రికార్డు సృష్టించాం.
ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు : ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల
ఖాతాల్లో 16న ఒక్కరోజే రూ.3 వేల కోట్లు జమ చేశాం. మిగిలిన రూ.1,271 కోట్లను
20వ తేదీ నాటికి ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాలను
తెరిచాం. 90శాతానికి పైగా సేకరణ పూర్తికావడంతో 6,366 కేంద్రాలను మూసివేశాం. 18
జిల్లాల్లో సంపూర్ణంగా ధాన్యం సేకరణ ముగిసింది. మిగతా జిల్లాల్లో ఆదివారం వరకు
పూర్తిచేస్తాం. కొనుగోళ్ల కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్లకు
ఇచ్చాం’’ అని గంగుల వివరించారు.