లేదు
నవ్యాంధ్ర రచయితల సంఘం సభలో అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్
అమరావతి : ఆనాడు కాంగ్రెస్ పిసినారివ్యక్తి అని ముద్ర వేసిన ఎన్టీఆర్ కిలో
రెండు రూపాయల పధకంగా మారి ఇప్పటికీ ఎన్నో పేద కుటుంబాలకు ఆకలి తీరుస్తున్నాడని
అన్నారు అరసం రాష్ట్ర కార్యదర్శి, సుప్రసిద్ధ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్
అన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరుజిల్లా శాఖ- డాక్టర్ పట్టాభి కళాపీఠము
ఆధ్వర్యంలో ‘కవిమిత్రుల కలయిక-కవి సమ్మేళనం’ నెలవారీ కార్యక్రమం ఆదివారం ఉదయం
బ్రాడీపేట ఎస్ హెచ్ ఓ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన
వల్లూరు శివప్రసాద్. ముందుగా ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్
చిత్రపటానికి పూలు సమర్పించి ఆ మహనీయుణ్ణి స్మరించుకున్నారు నిర్వాహకులు.
శివప్రసాద్ మాట్లాడుతూ- నటుడు రాజనాల కూతురి వివాహం సందర్భంగా ఆమెకు స్త్రీ
ధనంగా అప్పట్లోనే లక్ష రూపాయలు ఇచ్చి, వితరణకీ, పిసినారితనానికీ వున్న తేడాని
రాజనాలకి స్పష్టంగా తెలియజేసిన గొప్ప సౌజన్యమూర్తి ఎన్టీఆర్ అని అన్నారు. కలప
దొంగని హీరోగా చూపించే దుస్థితిలో సినిమా ఇండస్ట్రీ వుందంటే ఇందుకు
బాధ్యులెవరో అందరూ ఆలోచించాలన్నారు. కవులు చెప్పే నీతివాక్యాల్ని, సందేశాల్ని
పట్టించుకునే స్థితిలో నేటి సమాజం లేదన్నారు. ఈ విషయాన్ని రచయితల సంఘాలు
గుర్తించి అందుకు పరిష్కారమార్గాల్ని అన్వేషించాలన్నారు. సభాధ్యక్షత వహించిన
డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా
షూటింగులు గుంటూరు పురవీధుల్లో జరిగిన జ్ఞాపకాల్ని సభికులతో పంచుకున్నారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ సాహిత్య సంఘాల
విస్తరణకీ, సాహిత్య సంఘాల చీల్చివేతకు తేడా తెలియని అజ్ఞానం సాహిత్యరంగాన్ని
పట్టి పీడిస్తోందన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం జిల్లా కార్యవర్గాల
పునర్నిర్మాణంలో భాగంగా త్వరలో మరో మూడు జిల్లాల కొత్త కార్యవర్గాల్ని
ఎన్నుకోబోతుందన్నారు. పుస్తక సమీక్షలో భాగంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ జోస్యుల
కృష్ణబాబు రచించిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావు నాటకత్రయ సమాలోచనము పుస్తకాన్ని
సుప్రసిద్ధ కవి, రచయిత వై హెచ్ కే మోహన్ రావు సమీక్షించారు. పుస్తక రచయిత
కృష్ణబాబు పుస్తకాన్ని రాసిన నేపథ్యాన్ని సభికులకు తెలియజేశారు. అనంతరం జరిగిన
కవి సమ్మేళనంలో గోలి హనుమచ్ఛాస్త్రి, వెదుళ్ళపల్లి సాంబశివరావు, సౌపాటి
ప్రభాకర్, దుర్గం సునీత, గడల శివప్రసాద్, తాటికోల పద్మావతి, డాక్టర్
కుమారస్వామి, బ్రహ్మాంజలి కవితాగానం చేశారు. గోలి హనుమచ్ఛాస్త్రి చదివిన
‘ఆ’నందమూరి కవితను ఈ నెల బెస్ట్ పోయెమ్గా నిర్వాహకులు ఎంపిక చేసి రెండు వందల
రూపాయల నగదు, ప్రశంసాపత్రం, దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్
రావి రంగారావు, కందిమళ్ళ శివప్రసాద్, శరత్ ప్రమోద్ ఎల్వీ, దినవహి సత్యవతి,
గోలి విజయ, బి. జనార్థనరెడ్డి, బండికల్లు జమదగ్ని పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని సయ్యద్ జానీబాష, చొప్పా రాఘవేంద్రశేఖర్ నిర్వహించారు.