న్యూఢిల్లీ : భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి. యుద్ధ విమానం నుంచి
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. ఈ
ప్రయోగంతో సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని వాయుసేన
సాధించగలిగింది. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచే మరో కీలక ప్రయోగం
విజయవంతమైంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్
వెర్షన్‌ను గురువారం సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా
పరీక్షించారు. ఈ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి నిర్దేశిత దూరంలోని
నౌకను పేల్చేసింది. భారత వాయుసేన సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ
క్షిపణి బంగాళాఖాతం ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా తాకింది. ఈ
విజయవంతమైన ప్రయోగంతో భూతల/సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు
చేయగల సామర్థ్యాన్ని వాయుసేన సాధించిందని రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
బ్రహ్మోస్ ఎక్సటెండెడ్ రేంజ్ సామర్థ్యం, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం
సమర్థమైన పనితీరు, భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)కి ఒక వ్యూహాత్మక బలాన్ని
అందించనున్నాయని రక్షణశాఖ తెలిపింది. భవిష్యత్తులో యుద్ధ క్షేత్రాలలో భారత్
ఆధిపత్యం చలాయించడానికి ఇవి దోహదపడుతాయని తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన
క్లిప్పింగ్‌ను భారత వాయుసేన ట్విటర్లో పంచుకుంది. వాయుసేన, భారత నేవీ ,
డీఆర్డీవో , హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ , బ్రహ్మోస్ ఏరోస్పేస్
సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైందని ఐఏఎఫ్ తెలిపింది. కాగా యుద్ధ
విమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ
ఈ తరహా పరీక్ష చేపట్టారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్
ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి
చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు.