కుప్పం : రాష్ట్రంలో అరాచక పాలనపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఈనెల
27వతేదీనుంచి చేపట్టనున్న చారిత్రాత్మక పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు
రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి శ్రేణులు భారీగా కుప్పం చేరుకున్నారు.
గ్రామస్థాయి నేతనుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు నేతలు కుప్పం చేరుకోవడంతో
పండుగ వాతావరణం నెలకొంది. కుప్పం పట్టణంలో వీధులన్నింటినీ పార్టీ శ్రేణులు
టిడిపి జెండాలు, బెలూన్లు, బ్యానర్లు, స్వాగత తోరణాలతో అలంకరించడంతో
పసుపువర్ణంగా మారింది.
పసుపువర్ణంగా మారిన కుప్పం
పార్టీశ్రేణులు పెద్దఎత్తున కుప్పం రావడంతో లాడ్జిలు, హోటళ్లు నిండిపోయాయి.
దీంతో కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఆతిథ్యమిస్తున్నారు. యువనేత లోకేష్
యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టే వరదరాజస్వామి గుడి పరిసరాలన్నీ కోలాహలంగా
మారాయి. మరోవైపు కుప్పం హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో సుమారు పదెకరాల
ప్రాంగణంలో బహిరంగసభ కోసం పార్టీ సీనియర్ నేతల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు
చేశారు. తొలిరోజు యువనేత పాదయాత్రను సుమారు భారీగా ప్రజలు వచ్చే అవకాశం
ఉండటంతో అందుకు తగ్గట్లుగా పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
యువనేతకు ఘనస్వాగతం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానంతరం కుప్పం బయలుదేరిన యువనేత లోకేష్
నిర్ణీత సమయానికంటే 3గంటల ఆలస్యంగా కుప్పం చేరుకున్నారు. దారిపొడవునా
పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు యువనేత కోసం బారులు దారితీరారు. కుప్పం ఆర్
అండ్ బి అతిధిగృహం వద్ద మహిళా కార్యకర్తలు హారతులివ్వగా, పార్టీ సీనియర్ నేతలు
లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. కుప్పంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను
లోకేష్ కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఏడు సార్లుగా పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడుకు పట్టం కడుతూ వస్తున్న కుప్పం ప్రజలు యువనేత పాదయాత్రకు తమ సంపూర్ణ
మద్దతు తెలియజేస్తూ సహకారం అందజేస్తున్నారు. రాష్ట్రచరిత్రలో ఇదివరకెన్నడూ
ఎవరూ చేపట్టని విధంగా లోకేష్ చేస్తున్న యువగళం 4వేలకిలోమీటర్ల సుదీర్ఘ
పాదయాత్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మరో మైలురాయి కానుంది.