అమరావతి : యువగళం పేరిట 400రోజుల సుదీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబ సభ్యులు ఆశీర్వదించి పంపారు. లోకేశ్ బయలుదేరే సమయంలో చంద్రబాబు, భువనేశ్వరి సహా కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులనంతరం కడప బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. యువతకు భవితనవుతా, అభివృద్ధికి వారధిగా నిలుస్తానన్న లోకేశ్ రైతన్నను రాజుగా చూసేవరకూ విశ్రమించబోనని స్పష్టం చేశారు. యువగళం పేరిట 400 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు బయలుదేరిన నారా లోకేశ్‌కు కుటుంబ సభ్యులు ఆశీర్వదించి పంపారు. ఎన్టీఆర్ ఘాట్‌కు బయలుదేరే ముందు భార్య, కుమారుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులతో లోకేశ్ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఏడాదికిపైగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధమైన లోకేశ్ కుమారుడు దేవాన్ష్‌ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. భార్య నారాబ్రాహ్మణి బొట్టు పెట్టి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లోకేశ్ వాహనం ఎక్కేటప్పుడు తల్లి భువనేశ్వరి వెంట నడవగా తండ్రి చంద్రబాబు ఆయనకు ఎదురొచ్చారు. అత్తామామ నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవిల ఆశీర్వాదంతో పాటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.