హైదరాబాద్ : ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి అమలు చేయకుండా నిరుద్యోగ యువతను
ప్రధాన నరేంద్ర మోడీ , సీఎం కేసీఆర్ మోసం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు,
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇక్కడ కత్రియా హోటల్లో ప్రారంభమైన
యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరై
ప్రసంగించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన
సమావేశం జరిగింది. ఉత్తమ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అందరూ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
శివసేనారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న
ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ విభాగం పోషించాల్సిన పాత్రపై ఈ సమావేశాలలో
చర్చిస్తామన్నారు. తెలంగాణలో పార్టీ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్‌ను
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గజ్వేల్ నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నామని
తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం
ఉపాధి కల్పించేందుకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసే పథకం అమలు చేస్తుందన్నారు.
‘యూత్ జోడో.. పోలింగ్ బూత్ జోడో’ కార్యక్రమం ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రం
పరిధిలో ఐదుగురు యువకులను కాంగ్రెస్ సైనికులుగా తయారు చేసే ప్రక్రియపై
చర్చించినట్లు ఆయన మీడియాకు చెప్పారు. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ
శ్రీనివాస్, రాష్ట్ర ఇన్‌ఛార్జి కృష్ణ, పీసీసీ రాష్ట్ర వర్కింగ్
ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.