యువ శక్తి విజయవంతానికి ప్రత్యేక కమిటీలు
ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ
గృహ సారధులనియామకం అప్రజాస్వామికం
గృహ సారధులు, వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి డేటా ఎందుకు సేకరిస్తున్నారో
నిలదీయండి
శ్రీకాకుళం మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర కళా వైభవం ఉట్టిపడేలా.. సంస్కృతి, సంప్రదాయలు
ప్రతిబింబించేలా, యువత సత్తా చాటేలా జనసేన పార్టీ “యువ శక్తి” కార్యక్రమాన్ని
అద్భుతంగా నిర్వహిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఉమ్మడి
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో కమిటీలు
ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యువతకు
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఉదయం
శ్రీకాకుళంలో జనసేన పార్టీ యువ శక్తి కార్యక్రమ పోస్టర్ ను ఉత్తరాంధ్ర
నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
“ఉత్తరాంధ్ర పాంత్రంపై జనసేన పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మంచి
నాయకత్వాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగా
జనవరి 12వ తేదీన యువ శక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉత్తరాంధ్ర
సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమం ఉంటుంది. ఉత్తరాంధ్ర కళా వైభవం
రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా కళాకారుల ప్రదర్శనలతో పాటు యువతలో రాజకీయ చైతన్యం
కలిగించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు.
పోలీస్ ఉద్యోగార్థుల వయో పరిమితి పెంచాలి : ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉపాధి
కోసమే కాకుండా చదువుకోవడం కోసం వలసలు వెళ్లాల్సి వస్తోందని యువత ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
యూనివర్సిటీలో బోధకులు కొరత తీవ్రంగా వేధిస్తోందని, హాస్టల్స్ లో కనీస
సదుపాయాలు లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం
యువతకు కల్పించలేదు. కొత్తగా పేరు రిజిస్టర్ చేసుకున్న యువతకు జాబ్ కార్డులు
ఇవ్వొదని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇవ్వడం
దుర్మార్గమైన చర్య. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి మాట
తప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటూ
హడావుడి చేస్తోంది. ఈ మూడేళ్లు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా యువతను మానసికంగా
వేధించారు. కొంతమంది యువత ఏజ్ బార్ అయ్యిందనే ఆందోళన ఉన్నారు. వారికి మూడేళ్ల
వయోnపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల న్యాయమైన డిమాండ్ కు జనసేన
పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏజ్ బార్ అయిపోయిన
అభ్యర్ధులకు పోలీసు శాఖ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని మూడేళ్లు పెంచాలని
డిమాండ్ చేస్తున్నామన్నారు.
గ్రామ సారథుల నియామకం అప్రజాస్వామికం : వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల
వ్యవస్థను తీసుకొచ్చింది. 2.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని
గొప్పలు చెప్పుకుంది. నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం అందించింది. పాదయాత్ర
సమయంలో, ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చూసి తమ ఉద్యోగాలు
రెగ్యులర్ అవుతాయనే ఆశతో చాలీచాలని జీతానికి వాలంటీర్లు సేవలు అందించారు.
ఇప్పుడు వీళ్లపై పెత్తనం వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా గ్రామ
సారథులను నియమించాలనుకోవడం దుర్మార్గం. ఇది కచ్చితంగా అప్రజాస్వామికం.
దేనికోసం మీరు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారో ప్రజలకు వివరణ
ఇవ్వాలన్నారు.
కలసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం : జనసేన పార్టీ భవిష్యత్తులో
అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర వెనకబాటు తనం తొలగించడానికి ఎటువంటి చర్యలు
తీసుకోబోతోంది. ఉపాధి కోసం వలస నిరోధానికి ఎటువంటి పాలసీలు అమలు
చేయబోతున్నారు. సొంత ప్రాంతంలోనే యువత ఉద్యోగాలు చేసుకునేలా పరిశ్రమల
స్థాపనకు, పెట్టుబడుల ఆహ్వానానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో అన్నది
పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమంలో వెల్లడిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రతి
ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరం కలిసి కట్టుగా పని చేసి
వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధికార
ప్రతినిధులు, అసెంబ్లీ ఇంచార్జులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.