అమరావతి : పట్టణ భూ పరిమితుల చట్టం(యూఎల్సీ) కింద సీలింగ్ భూముల
క్రమబద్ధీకరణ రుసుములను రాష్ట్ర రెవెన్యూ శాఖ తగ్గించింది. గతేడాది జనవరి 31న
యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు జారీ చేసిన జీవో నంబరు 36కు ప్రస్తుతం పలు
సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులు ఇటీవల వెలువడ్డాయి. యూఎల్సీ భూములు రాష్ట్రంలో
విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. ఇంతకుముందు జారీ చేసిన
జీఓ 36లో పేర్కొన్న షరతుల్లో ప్రధానంగా విస్తీర్ణంతో సంబంధం లేకుండా
క్రమబద్ధీకరణ మొత్తాన్ని మూల విలువకు(బేసిక్ వేల్యూ) ఒకటిన్నర రెట్లు రుసుము
చెల్లించాలని రెవెన్యూ శాఖ పేర్కొంది. దీనిపై లబ్ధిదారుల నుంచి తీవ్ర
వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో రుసుములను రెవెన్యూ శాఖ సవరించింది. ఎవరైతే
లబ్ధిదారులు డబ్బులు చెల్లిస్తారో వారికిచ్చే పట్టా పదేళ్ల తరువాత
బదలాయించుకునే హక్కును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఆసక్తి ఉన్న
లబ్ధిదారులు 2023 డిసెంబరు 31లోగా దరఖాస్తులను జిల్లా అధికారులకు సమర్పించాలని
ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్
పేర్కొన్నారు.
తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం 150 చదరపు గజాల వరకు అర్హత కలిగిన
అల్పాదాయ, అధిక ఆదాయ (బీపీఎల్, ఏపీఎల్)వర్గాలకు ఉచితంగా డీపట్టా ఇస్తారు.
150 నుంచి 300 చ.గజాల వరకు అధిక, అల్పాదాయ వర్గాలు ఎవరైనా స్థూల విలువలో 15%
రుసుం చెల్లించాలి. 300 నుంచి 500 చ.గజాల వరకు ఉన్న స్థలాల్లోని నిర్మాణాలకు
స్థూల విలువలో 30% రుసుం కట్టాలి. నీ 500 చ.గజాల కన్నా ఎక్కువ ఉంటే వంద శాతం
చెల్లించాలి. అభ్యంతరం లేని వాటి విషయంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల
ఆక్రమణల క్రమబద్ధీకరణ కేటగిరిలో వంద చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించి
డి.పట్టా అందజేస్తామని ఇటీవల సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత జారీ చేసిన
ఉత్తర్వుల్లో ఈ రుసుములు ఎక్కువగా ఉన్నందున ప్రజల నుంచి స్పందన కొరవడింది.
దీంతో వాటినీ తగ్గిస్తూ జారీచేసిన సవరణ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం
101-200 చ.గజాలకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోని స్థూల మూల విలువలో
50%, 201-300కు 100%, 301-500 చ.గజాలకు మూల విలువలో ఒకటిన్నర రెట్లు వసూలు
చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ ఉన్న వారికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.