బ్రిటన్ను పాలించనున్న భారతీయ సంతతి వ్యక్తి
యూకే కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు .ప్రధానమంత్రి రేసులో ఉన్న పెన్నీమోర్డాంట్ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రిసి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. యూకే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధాని కోసం పలువురు పోటీ పడ్డారు. బోరిస్ జాన్సన్ మాత్రం ఆ పదవికి పోటీ చేసేందుకు విముఖత చూపారు. ప్రధాని పదవికి నామినేషన్ దాఖలు చేసిన మోర్ఠాండో ఆ తరువాత తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది.
బ్రిటన్ కు గత ఆరేళ్లలో ఐదో ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన తొలి వ్యక్తి ఎన్నిక కావడం విశేషం. బ్రిటన్ రాజకీయాల్లో ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ రికార్డు సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తికి స్వయానా అయన అల్లుడు కావడం విశేషం. రిషి సునాక్ 2015 లో రిచ్ మండ్(యార్క్స్) నుంచి ఎంపీగా తొలిసారిగా పార్లమెంట్ లోకి ప్రవేశించారు. 2017,2019 లలో కూడా ఇదే స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఖజానా చాన్సిలర్ గా ఆయన నియమితులయ్యారు. ఈ ఏడాది జూలై వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
లిజ్ ట్రస్ తో అమీతుమీ
లిజ్ ట్రస్, రిషి సునాక్ గతంలో ప్రధాని పదవికి పోటీ పడ్డారు. అయితే, చివరి నిమిషంలో రేసులో రిషి సునాక్ వెనుకబడ్డారు.దీంతో లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. యూకేలో ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో లిజ్ ట్రస్ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా 44 రోజులు మాత్రమే ఆమె కొనసాగారు. దాదాపు 44 రోజుల క్రితం లిజ్ ట్రస్ చేతిలో ఓటమి పాలైన రిషి సునాక్ అనుహ్యంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ లో చోటు చేసుకున్న ఆర్ధిక సంక్షోభం, ఇతరత్రా కారణాలతో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దీంతో రిషి సునాక్ , మోర్టాండో పోటీ పడ్డారు. అయితే ప్రధాని పదవి రేసు నుంచి మోర్టాండో తప్పుకొన్నారు. దీంతో రిషి సునాక్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న యూకేను బయట పడేయడమే రిషి సునాక్ ముందున్న పెద్ద సవాల్.
మూలం: బి.బి.సి. న్యూస్