చంద్రబాబును అవకాశవాది గానే గుర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు
విజయవాడ : రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి లాభపడాలని ప్రతిపక్ష నేత
చంద్రబాబు స్కెచ్ వేశాడని, ప్రాజెక్టుల పరిశీలన ముసుగులో భారీ కుట్రకు
తేరలేపాడని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా
శనివారం ఆయన ఈ అంశంపై తెలుగుదేశం అధినేతపై ఘాటుగా స్పందించారు. తన పార్టీ
కార్యకర్తలను రెచ్చగొట్టి, గొడవలతో లబ్ధి పొందాలనే వ్యూహరచన చంద్రబాబు
దిగజారుడు తనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. బీరు సీసాలు, కర్రలు, రాళ్లతో
పోలీసులపై దాడి చేయించాడని చెప్పారు. చంద్రబాబు సృష్టించిన అల్లర్లలో
రెచ్చిపోయిన టీడీపీ మూకలు రెండు పోలీసు వాహనాలను తగులబెట్టాయని అన్నారు. 27
మంది పోలీసులు అలాగే 50 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయపడ్డారని
అన్నారు.
చంద్రబాబును అవకాశవాది గానే గుర్తిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు : రాయలసీమ,
కోస్తాంధ్ర చివరకు ఆయన నివాసం ఉంటున్న హైదరాబాద్ వాసులు కూడా చంద్రబాబును
మనిషిగా భావించడంలేదని, తమకు ద్రోహం చేసిన ‘అవకాశవాది’ గానే అందరూ
భావిస్తున్నారని అన్నారు. ఆయన వ్యాపారాల కోసం, అతని సన్నిహితులు కొద్దిమంది
సమూహం కోసమే అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రయాస పడి, ఇప్పుడు కబుర్లు చెబితే
ప్రజలు నమ్మరని తెలుసుకోవాలన్నారు. తొడేళ్లు, నక్కలు ఎప్పుడూ సింహంగా
మారినట్టు కలలు కంటూ సింహంలా గర్జించాలని చూస్తాయి. అయితే జన్మత: వచ్చిన ఊళ
ఎంత ప్రయత్నించినా పోదని అన్నారు. అలాగే విపక్షనేత చంద్రబాబు కూడా సింహంలా
మారాలని ఆశపడుతున్నాడని అయితే 14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడే కాలేకపోయాడని,
ఇప్పుడు కొత్తగా సింహం ఎలా అవుతాడని అన్నారు.
అసైన్డ్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు : రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించిందని విజయసాయిరెడ్డి అన్నారు. అసైన్డ్
భూములు కేటాయించి 20 ఏళ్లు పూర్తయిన భూములపై రైతులకు సర్వ హక్కులు
కల్పించిందని అన్నారు. 1954 నుంచి 2003 లోపు ఇచ్చిన భూములు 28 లక్షల
ఎకరాలకుపైనే ఉన్నాయని అన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించి పదేళ్లు దాటిన
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించిందని అన్నారు. ఈ మేరకు చేసిన చట్ట
సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారని అన్నారు.
ఉద్యోగార్దులకు తీపికబురు : వైద్య ఆరోగ్య శాఖలో 51,000 ఖాళీలను భర్తీ చేసిన
అనంతరం ఏపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో 2,635 ఉపాధ్యాయ స్థానాలను, ఐఐఐటీల్లో
660 పోస్టులను భర్తీ చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగ సమస్యలు పరిష్కారంలో ఎప్పుడూ
ముందుంటుందని గుర్తుచేశారు.
టీడీపీ మద్దతుతో మరో చిట్ఫండ్ కుంభకోణాన్ని భరించేందుకు ఆంధ్రా ప్రజలు
సిద్ధంగా లేరు : టీడీపీ మద్దతుతో మరో చిట్ఫండ్ కుంభకోణాన్ని భరించేందుకు
ఆంధ్రా ప్రజలు సిద్ధంగా లేరని మార్గదర్శి చిట్ఫండ్ ఆధ్వర్యంలో జరుగుతున్న
కార్యక్రమాలు కంపు కొడుతున్నాయని అన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలు, చిట్ ఫండ్
చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోందని ఈమేరకు మార్గదర్శి
పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచిస్తుందని ఆయన అన్నారు.