గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రక్తహీనత
నిర్మూలన కోసం బీ12 ట్యాబెట్లను బాధితులకు పంపిణీ చేసే విషయాన్ని
పరిశీలించాలని, తొలుత పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించాలని రాష్ట్ర
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరి లోని ఏపీఐఐసీ
టవర్స్ లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం
ఎస్ డీ జీ (సస్టయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) పై ఆ శాఖ
ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజిని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో మన
రాష్ట్రం భారతదేశంలోనే ముందుండాలని చెప్పారు. అన్ని అంశాల్లోనూ ఏపీ
తొలిస్థానంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. ముఖ్యంగా
అనీమియా నివారణకు మనం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం
ఉందన్నారు. కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత
లేకుండా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు, గర్భిణులు,
బాలింతలకు బీ-12 ట్యాబ్లెట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని
సూచించారు. మూడు నెలల కోర్సుగా ఈ ఔషధాలను అందించగలిగితే బాలికలు,
గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు.
మాతా శిశుమరణాల నివారణలో ముందున్నాం
మాతా శిశుమరణాల నివారణలో మన రాష్ట్రం ఈ దేశంలోనే ముందంజలో ఉందని
పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి సూచీల్లో ఇది ఎంతో కీలకమని తెలిపారు.
అధికారులు మరింతగా చొరవచూపి మాతా శిశుమరణాలు లేకుండా చూడాలని చెప్పారు.
మన రాష్ట్రంలో ఇప్పటికే 99.66 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే
జరుగుతున్నాయని, ఇది శుభపరిణామమని చెప్పారు. వంద శాతం కాన్పులు
ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు,
బాలింతల్లో పోషకాహార లోపం లేకుడా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా
కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, ఈ ఫలాలు లబ్ధశిదారులకు
సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే నని చెప్పారు.
గర్భిణులకు మరింతగా సేవలు అందిద్దాం
బాలింతలు, గర్భిణులకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందిస్తే శిశువులు
పూర్తి ఆరోగ్యంతో జన్మిస్తారని మంత్రి తెలిపారు. వీరిని ఆస్పత్రికి
తీసుకెళ్లి వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే తల్లీబిడ్డా
ఎక్స్ప్రెస్ వాహనాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని
ఆదేశించారు. టీబీ రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు. టీబీ
పరీక్షల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వెంటనే పరీక్షలు జరిగేలా చర్యలు
తీసుకోవాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా
క్షేత్రస్థాయి సిబ్బంది అయిన అంగన్వాడీలు, ఆయాలు, ఆశావర్కర్లు, ఏఎన్ ఎం ల
సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు.