హైదరాబాద్ : వచ్చే వేసవిలో పెరగనున్న గరిష్ట డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్
సరఫరా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా రబీకి
నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు మింట్
కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్
రావు,టి యస్ యస్ పి డి సి యల్ సి యం డి రఘుమారెడ్డి లతో మంత్రి జగదీష్ రెడ్డి
ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం నుండి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు
అవుతుందని ఆయన తెలిపారు.రబీ సీజన్ లో ఉమ్మడి రాష్ట్రంలో 6,666 మేఘావాట్లు ఉన్న
డిమాండ్ ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే 14,160 మేఘావాట్లకు చేరడమే ఇందుకు
నిదర్శనమన్నారు.ముందెన్నడూ లేని రీతిలో డిసెంబర్ నెలలో సైతం విద్యుత్ డిమాండ్
14,017 మేఘావాట్లు గా నమోదు అయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర
విద్యుత్ సరఫరాలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా జరుగుతుందన్నారు.ఈ డిమాండ్ ఈ
వేసవికాలంలో 15,500 మేఘావాట్లు కు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు సమీక్ష
సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు తగిన రీతిలో చర్యలు
తీసుకోవాలని సి యం డి లకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న
పారిశ్రామికాభివృద్దికి తోడు పెరుగుతున్న గృహావినియోగ దారుల వినియం,వ్యవసాయ
రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న
ఉచిత విద్యుత్ సరఫరా లతో ఈ డిమాండ్ పెరిగి 15,500 మేఘావాట్లను మించి
పోతుందన్నారు.అదే విదంగా టి యస్ యస్ పి డి సి యల్ లో ఖాళీగా ఉన్న 1553 జూనియర్
లైన్ మెన్ లతో పాటు 48 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీకి మంత్రి జగదీష్
రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం టి యస్ యస్ పి
డి సి యల్ లో మొత్తం 1601 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలంటూ
మంత్రి జగదీష్ రెడ్డి టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి ని
ఆదేశించారు.