రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసిన ఏ.పి.ఎస్.ఆర్.టి.సి
విజయవాడ : 2017 సంవత్సరంలో పూర్తిస్థాయిలో కార్గో సరుకు రవాణా ప్రారంభించిన ఏ.పి.ఎస్.ఆర్.టి.సి తన సేవలతో వినియోగదారులను మెప్పించడమే కాకుండా రోజురోజుకీ అభివృద్ధి సాధిస్తూ సరుకు రవాణాలో అగ్రగామిగా నిలిచింది. అతి తక్కువ సమయంలో సరుకు, పార్శిళ్ళను చేరవేస్తూ మన్ననలు పొందుతోంది. దీనిలో భాగంగా గత ఆర్ధిక సంవత్సరం అనగా 2021-22 లో సాధించిన రూ.122 కోట్ల ఆదాయాన్ని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగియకుండానే తేదీ 25 డిసెంబర్ 2022 న అధిగమించింది.
తన టార్గెట్లను తానే అధిగమిస్తూ ముందుకు దూసుకు పోతోంది ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. 2021 లో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించి అందరి ప్రశంసలు అందుకొంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా, హైదరాబాద్, బెంగళూర్ చెన్నై వంటి నగరాలలో కూడా లాజిస్టిక్స్ సేవలు అందించబడుతున్నవి. రాష్ట్రం లోని 84 బస్టేషన్లలో , 480 అధీకృత పార్శిల్ బుకింగ్ ఏజంట్ల వద్ద నగదు చెల్లింపుతో పాటు యు పి ఐ సేవలు కూడా లభిస్తున్నవి. ప్రత్యేకంగా రూపొందించబడిన డి.జి.టి. ల ద్వారా, సర్వీసు బస్సులలోని డిక్కీల ద్వారా పార్శిల్, కొరియర్ సేవలు వేగవంతంగా అందిస్తున్నారు. డోర్ డెలివరీ చేయబడుతున్నవి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి బస్టేషన్లలో 24X7 పార్శిల్, కొరియర్ బుకింగ్ సేవలు కల్పించబడ్డాయి.
డీజిల్ ధరలు పెరిగి సంస్థపై భారం పడిననూ కూడా 2018 లో నిర్ధారించిన సరుకు రవాణా రేట్లనే ఇప్పటికీ కొనసాగిస్తూ వినియోగదారులకు ఉత్తమ సేవలందిస్తూ ముందుకు సాగుతున్నది. ఇతర ప్రైవేటు సరుకు రవాణా ఏజన్సీల కంటే అత్యంత చవకైన, వేగవంతమైన సేవలు అందిస్తూ రూ.122 కోట్ల ఆదాయాన్ని దాటింది. కొరియర్ & సరుకు రవాణాలో ఇతర రాష్ట్రాల ఆర్టీసీల దృష్టిని కూడా ఆకర్షించి వాటికి మార్గదర్శకంగా నిలిచింది. కార్గో అండ్ లాజిస్టిక్స్ లో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అనుసరిస్తోన్న విధివిధానాలను అధ్యయనం చేయడానికి ఇతర ఆర్టీసీలు సైతం ఉత్సుకత చూపించి ఇక్కడికి వస్తున్నాయంటే అది ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. కే గర్వకారణంగా నిలిచింది. ఈ ఆర్ధిక సంవత్సరం (2022-23 ) ఇంకా 3 నెలల వ్యవధి ఉండగానే గత ఏడాది ఆదాయాన్ని అధిగమించి రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది. ఈ ఘనత సాధించడానికి అధికారులు, సూపర్ వైజర్లు, ట్రాఫిక్ సిబ్బంది, కార్గో సిబ్బంది డ్రైవర్, కండక్టర్ల కృషి ఎంతో ఉంది. మున్ముందు ఇదే విధంగా వినియోగదారులకు ఉత్తమ సేవలందించి గణనీయంగా ఆదాయం పెంచుకుంటామని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.