ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణ
మాస్కో : ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రమైన జపొరిజియాపై మళ్లీ
ఉక్రెయిన్, రష్యా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ప్లాంట్‌ను పేల్చివేసేందుకు
అణురియాక్టర్ల పైకప్పుపై రష్యా పేలుడు పదార్ధాలను అమర్చిందని, ఇందుకు
సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు తమ దగ్గర ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు
జెలెన్స్కీ ఆరోపించారు. నీపర్ నది ఒడ్డున ఉన్న ఈ జపొరిజియా ప్లాంట్
ప్రస్తుతం రష్యా దళాల అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలను పోలిన
వస్తువులను ప్లాంట్ పైకప్పునకు అమర్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని
జెలెన్స్కీ ఉటంకించారు. వీటిని విద్యుత్ యూనిట్లకు అత్యంత సమీపంలోనే
అమర్చారన్నారు. నిఘావర్గాల సమాచారం ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు
వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు
చేశారు. ఆ ప్లాంట్‌కు పొంచిఉన్న అతిపెద్ద ముప్పు రష్యానే అని జెలెన్స్కీ
ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా మాత్రం ఉక్రెయినే అణువిద్యుత్తు కేంద్రంపై
దాడికి యత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. అణువ్యర్థాలతో కూడిన పేలుడు
పదార్థాలతో ప్లాంట్‌పై దాడి చేయాలని కీవ్ యోచిస్తోంది. జులై 5వ తేదీ రాత్రి
ఉక్రెయిన్ సైన్యం జపొరిజియాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడి
చేసిందని రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి.