ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్ బంకర్లోనే?
ఎగువ సభలో ప్రసంగం..వార్షిక మీడియా సమావేశం రద్దు
మాస్కో : రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ
వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి
బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి
పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త
చర్యగా పుతిన్‌ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక
ఉన్న ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్‌లో
ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి
బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే
అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు
వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన
ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా
సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల
కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు
చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై
యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం
చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు
రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.