యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం ఎక్కడున్నారనే దానిపై వినిపిస్తున్న
ఊహాగానాలకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తెరదించారు.
ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్నారని ఆయన
విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వాగ్నర్ సేనలు తిరుగుబాటు ప్రయత్నానికి
ముందు కొనసాగిన ప్రాంతాల్లోని శిబిరాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ
శిబిరాలు నిర్దిష్టంగా ఎక్కడున్నాయో మాత్రం చెప్పలేదు. గత నెలలో లుకషెంకో
మధ్యవర్తిత్వం వల్లే వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు ప్రయత్నాన్ని
విరమించుకున్నాయి. అప్పట్లో ప్రిగోజిన్ బెలారస్లో ఉన్నారని లుకషెంకో
తెలియజేయడం గమనార్హం.
ప్రిగోజిన్ స్థావరాల నుంచి బంగారం స్వాధీనం : సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో
ప్రిగోజిన్ కార్యాలయం, ఇల్లు, ఇతర స్థావరాలపై అధికారులు బుధవారం దాడులు
నిర్వహించారు. భారీగా బంగారం, నగదు, విగ్గులు, ఆయుధాలు, పాస్‌పోర్టులు
స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఫొటోలు కూడా బయటికొచ్చాయి.
ఫిన్లాండ్ దౌత్యవేత్తలపై రష్యా బహిష్కరణ వేటు : తమ దేశానికి చెందిన తొమ్మిది
మంది దౌత్యవేత్తలను ఫిన్లాండ్ గత నెలలో బహిష్కరించిన నేపథ్యంలో రష్యా తాజాగా
ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. రష్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని
ఆరోపిస్తూ తమ దేశం నుంచి తొమ్మిది మంది ఫిన్లాండ్ దౌత్యవేత్తలను
బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆ దేశ
కాన్సులేట్‌ను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.