అసలు ఏవరీ ప్రిగోజిన్?
రష్యా మిలిటరీ న్యాయకత్వాన్ని గద్దె దించుతానన్న వాగ్నర్ గ్రూప్ అధినేత
ఇంతలో యూటర్న్, సైన్యాన్ని వెనక్కు పిలిపించుకుంటున్నట్టు ప్రకటన
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రిగోజిన్
అంచెలంచెలుగా ఎదుగుతూ పుతిన్‌కు సన్నిహితుడిగా మారిన వైనం
రష్యా రక్షణ శాఖతో ప్రిగోజిన్‌కు విబేధాలు
పుతిన్‌కు తన అవసరం ఉందన్న దిలాసాతో దూకుడు ప్రదర్శించిన ప్రిగోజిన్
ప్రిగోజిన్ తిరుగుబాటుతో పుతిన్ బలహీనత బయటపడిందంటున్న నిపుణులు
వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్‌పై విరుచుకు పడుతున్న ఓ ప్రైవేటు మిలిటరీ దళం. ఈ
దళానికి అధిపతి యెవ్జినీ ప్రిగోజిన్. మొన్నటివరకూ కొద్ది మందికి మాత్రమే
తెలిసిన ప్రిగోజిన్ పేరు ఒక్కసారిగా ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఏకంగా రష్యా
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వ్యక్తిగా
ప్రిగోజిన్ పెను సంచలనం రేపాడు. రష్యా మిలిటరీ నాయకత్వాన్ని గద్దె దించుతానని
భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తన దారికి అడ్డొచ్చే వారిని సర్వ నాశనం చేస్తానన్నాడు.
మాస్కో తన వశం కాబోతోందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో తన సేనలను వెనక్కు
రమ్మంటూ ఆదేశించాడు. అపార ప్రాణనష్టం నివారించేందుకు ఇలా చేశానంటూ యూటర్న్
తీసుకున్నాడు.
అసలెవరీ ప్రిగోజిన్..?
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ప్రిగోజిన్ తొలుత షెఫ్‌గా
మారాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్ నెలకొల్పి ప్రభుత్వ అధికారులకు ఆహారం సరఫరా
చేసే కాంట్రాక్ట్ సంపాదించాడు. అలా అలా పలు ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది
పుతిన్ షెఫ్‌గా పేరుపొందాడు. ఈ క్రమంలో పుతిన్‌కు సన్నిహితుడిగా మారిన
ప్రిగోజిన్, ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపును నెలకొల్పి రష్యా సైన్యానికి
వెన్నుదన్నుగా నిలిచేవాడు. ఆఫ్రికా, సిరియా, ఉత్తర ఉక్రెయిన్‌లో పుతిన్ ఆదేశాల
మేరకు దాడులకు దిగి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో
రష్యా ఆర్మీ తడబడుతున్న సమయంలో రంగంలోకి దిగిన వాగ్నర్ గ్రూప్ రష్యాకు కొన్ని
చెప్పుకోదగ్గ విజయాలనే అందించింది. శత్రువులపై అత్యంత కర్కశంగా దాడులు చేసే
వాగ్నర్ గ్రూప్‌తో తనకు ఉపయోగాలు ఉన్నాయని భావించిన పుతిన్, ప్రిగోజిన్
దూకుడును చూసిచూడనట్టుగా ఉండేవారు. ఇక ప్రిగోజిన్‌కు తొలి నుంచి రష్యా సైనిక
నాయకత్వంతో విభేదాలున్నాయి. తన దళాలపై రష్యా రక్షణ శాఖ అధిపత్యం ఏమిటని
ప్రిగోజిన్ ప్రశ్నించేవారు. ఈ భేదాభిప్రాయాలు ముదిరి రష్యా రక్షణ శాఖ మంత్రితో
ఆయనకు వ్యక్తిగత వైరం మొదలైంది. ఇదిలా ఉంటే, ఇటీవల పుతిన్ ఓ సంచలన ప్రకటన
చేశారు. ప్రైవేటు మిలిటరీ దళాలపై రక్షణ శాఖ అజమాయిషీ తప్పదని తేల్చి చెప్పారు.
వాగ్నర్ గ్రూప్ పేరును ప్రస్తావించకపోయినా ప్రిగోజిన్‌కు తన భవిష్యత్తు
కళ్లముందు కనిపించింది. ఇంతకాలం సర్వాధికారిగా అమితమైన స్వేచ్ఛను అనుభవించిన
అతడు చివరకు రష్యా రక్షణ శాఖనే తన లక్ష్యంగా చేసుకున్నాడు. మాస్కోను
ఆక్రమించేంత సైనిక ఆయుధ సంపత్తి వ్యాగ్నర్ గ్రూపు వద్ద లేదు. అయితే, రష్యాకు
ఎదురవుతున్న కఠిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రిగోజిన్ ఓ
ప్రయత్నం చేశాడు. పుతిన్‌కు తన అవసరం ఉందన్న ధీమాతో తనకు కావాల్సింది నయానో
భయానో సాధించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ప్రిగోజిన్ చర్యతో రష్యా అధ్యక్షుడు
పుతిన్ బలహీనత బయటపడిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రష్యా సైన్యంలో
ఐకమత్యం లేని విషయం స్పష్టమైందని చెబుతున్నారు. పుతిన్ నాయకత్వానికి ఇది పెను
సవాలని వ్యాఖ్యానిస్తున్నారు. పుతిన్‌పై రష్యా దళాలకు ఉన్న విధేయతే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఉక్రెయిన్ మంత్రి ఇటీవల
వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి, రష్యా సైన్యంలో లుకలుకలు ఏస్థాయిలో ఉన్నాయో
ఇట్టే అర్ధంచేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.