నియామే : పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ
దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక
చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు
తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు
జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు.
తిరుగుబాటు పర్వం : కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు
ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో
ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన
పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని,
అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న
నేపథ్యంలో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ
అబ్రందానే తెలిపారు.
దేశమంతటా కర్ఫ్యూ : ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ దేశ సరిహద్దులను మూసి
వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని
అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ
దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు.