వాషింగ్టన్ : రష్యాలో వాగ్నర్ గ్రూపు చేసిన తిరుగుబాటులో తమకు, నాటో కూటమికి
ఎలాంటి ప్రమేయం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టంచేశారు. పాశ్చాత్య
దేశాలు, లేదా నాటోపై నింద వేసే అవకాశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు
ఇవ్వకూడదనే తన అభిప్రాయంతో మిత్రపక్షాలన్నీ ఏకీభవించాయని తెలిపారు. ఉక్రెయిన్
ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలకు తమ మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడే అంచనా
వేయడం తొందరపాటు అవుతుందని చెప్పారు.
తిరుగుబాటు సమయంలో అప్రమత్తత : రష్యాపై కిరాయి సైన్యం తిరుగుబాటు సమయంలో
బైడెన్ చాలా అప్రమత్తత పాటించారు. తమపై నిందలు పడకుండా ఏం చేయాలనేదానిపై
జాగ్రత్తలు తీసుకొన్నారు. తనను అంతమొందించడానికి పాశ్చాత్య దేశాలు కాచుకుని
కూర్చున్నాయని పుతిన్ చేసే ఆరోపణలకు బలం చేకూర్చే అవకాశం ఎట్టిపరిస్థితుల్లో
ఇవ్వకూడదని బైడెన్ సర్కారు భావించింది. ఇతర దేశాధినేతలతో మాట్లాడినప్పుడు
కూడా తమవైపు నుంచి ఎటువంటి హడావుడి ఉండకుండా చూసుకోవాలని, రష్యాలో ఏం
జరుగుతుందో జరగనీయాలని వారికి సూచించారు. తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమనే
సందేశాన్ని రష్యాకు కూడా పంపినట్లు సమాచారం