ఇవాళ క్రాష్ ల్యాండింగ్
సాంకేతికలోపంతో కుప్పకూలిన వైనం
ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్-3
తాజాగా రెండో డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం
రష్యా ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో ఈ నెల 11న ప్రయోగించిన లూనా-25 మూన్ మిషన్
చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. జాబిలి దక్షిణ భాగంపై దిగే
క్రమంలో లూనా-25 ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దాంతో ఆ స్పేస్ క్రాఫ్ట్
కు భూమితో సంబంధాలు తెగిపోయాయి. తమ ప్రయోగం విఫలమైందని రష్యా అంతరిక్ష పరిశోధన
సంస్థ రాస్ కాస్మోస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి భారత
అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3పై నిలిచింది. మరో మూడు
రోజుల్లో చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో దిగనుంది.
రష్యా మూన్ మిషన్ విఫలమైన నేపథ్యంలో, భారత చంద్రయాన్-3 పరిస్థితి ఎలా
ఉండనుంది? అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజాగా చంద్రయాన్-3 కక్ష్యను 25/134 కిలోమీటర్లకు తగ్గించే రెండో డీబూస్టింగ్
ఆపరేషన్ విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. దాంతో చంద్రయాన్-3 స్పేస్
క్రాఫ్ట్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ ప్రక్రియ విజయవంతం కావడం భారత
శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. గతంలో చంద్రయాన్ విఫలమైనా,
ఈసారి అనుకున్నది సాధిస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. అన్నీ
అనుకున్నట్టుగా సాగితే చంద్రయాన్-3 ల్యాండర్ ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు
చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష
శాస్త్రజ్ఞులందరూ భారత చంద్రయాన్-3 పురోగమిస్తున్న తీరును అత్యంత ఆసక్తిగా
పరిశీలిస్తున్నారు.