ఆ దిశగా ఐరోపా యూనియన్ ప్రణాళికలు
దెబ్బతిన్న ఉక్రెయిన్ను బాగు చేయటానికి రష్యా ఉపయోగపడితే? చాలామంది దృష్టిలో
ప్రస్తుతానికిది ఊహించటానికి కూడా వీలుగాని ప్రతిపాదన. కానీ, ఐరోపా యూనియన్
(ఈయూ) మాత్రం ఆ అనూహ్యాన్నే పట్టుదలతో నిజం చేయాలనుకుంటోంది. ముల్లును
ముల్లుతోనే తీయాలన్నట్లు ఉక్రెయిన్ను అస్తవ్యస్తం చేసిన రష్యాతోనే ఆ దేశాన్ని
బాగు చేయించాలనుకుంటోంది ఐరోపా. రష్యా నిధులతో ఉక్రెయిన్ పునర్నిర్మాణం
చేపట్టాలని బలంగా భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు మొదలెట్టింది. రోజూ
క్షిపణులతో, డ్రోన్లతో దాడులు చేస్తూ ఉక్రెయిన్ను ఊపిరిపీల్చకుండా చేస్తున్న
పుతిన్ సైన్యం ఆ దేశ పునర్నిర్మాణానికి అంగీకరిస్తుందా? దానికి ఆర్థిక సాయం
చేయటానికి ముందుకొస్తుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తటం సహజం.
ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యా అందుకు అంగీకరించదు. అందుకే ఐరోపా యూనియన్ తనదైన
శైలిలో ఉక్రెయిన్ను బాగు చేయించాలనుకుంటోంది. యుద్ధం ఆరంభమైన తర్వాత అమెరికా,
ఐరోపా యూనియన్లు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఆ క్రమంలో తమతమ
దేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న రష్యా సొమ్ము, ఆస్తులను స్తంభింపజేశాయి. వీటి
విలువ 215 బిలియన్ డాలర్లని అంచనా. వీటితో పాటు రష్యా కంపెనీలు, అనేకమంది
సంపన్నుల వ్యక్తిగత అకౌంట్లు, ఆస్తులపైనా ఆంక్షలు విధించారు. వీటి విలువ మరో
20 బిలియన్ డాలర్లపైనే ఉండొచ్చు. రష్యా సెంట్రల్ బ్యాంకు ఆస్తులూ ఉన్నాయి.
వీటన్నింటినీ ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వాడాలన్నది ఈయూ ప్రతిపాదన.
స్తంభింపజేసిన రష్యా సొమ్మును ఈయూ వాడుకోవాలనుకుంటున్నప్పటికీ, అదంత సులభం
కాదన్నది నిపుణుల వాదన. ఇందులో చాలా సాంకేతిక, చట్టపరమైన సవాళ్లతో పాటు రాజకీయ
సంక్లిష్టతలూ దాగున్నాయి. ఉక్రెయిన్ బాధకు రష్యా మూల్యం చెల్లించాల్సిందే.
అలా కుదరదనే ఆలోచనకే అవకాశం లేదని ఈయూ అధ్యక్షుడు ఉర్సుల వాండెర్ లెయెన్
ఇప్పటికే స్పష్టం చేశారు. రష్యా దాడులతో దెబ్బతిన్న ఉక్రెయిన్ను
పునర్నిర్మించాలంటే 440 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని గత మార్చిలో
ప్రపంచబ్యాంకు, ఈయూ, ఐక్యరాజ్యసమితి కలిసి అంచనా వేశాయి. ఈ సంఖ్య యుద్ధం
కొనసాగిన కొద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రష్యా సొమ్ము నగదు, ఆస్తుల
రూపంలో ఎంతుందో చూసుకోవాలి. నగదు వినియోగానికి చట్టపరంగా ఇబ్బందులు
ఎదురుకావచ్చు. కానీ రష్యా సెంట్రల్‌బ్యాంక్ ఆస్తులు, సొమ్మును వాడుకోవటానికి
కొంతమేరకు వెసులుబాటు ఉంది. అయితే, అది ఉక్రెయిన్ అవసరాలకు పెద్దగా
ఉపయోగపడకపోవచ్చు. అయినా రష్యాను మరింత ఇబ్బందులపాలు చేయాలనుకుంటే చేయొచ్చు. ఏ
నిర్ణయం తీసుకున్నా ఈయూ ఒక్కటే ఏమీ చేయలేదు. అమెరికా, జపాన్, బ్రిటన్,
స్విట్జర్లాండ్‌లాంటి ఇతర దేశాలూ అంగీకరించాల్సి ఉంటుందని ఐరోపా యూనియన్‌లో ఈ
అంశంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ ఆండర్స్ అహిన్లిడ్ వ్యాఖ్యానించారు.
యుద్ధానంతరం రష్యా సంపన్నులు కొందరి ఆస్తులను ఉక్రెయిన్‌కు మళ్లించటానికి
అమెరికా గత నెల అనుమతినివ్వటం గమనార్హం.