కాయకష్టం చేసే రైతుకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు
ద్వారంపూడి లాంటి వాళ్లు అనాయాసంగా సంపాదిస్తున్నారు
రైతు సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ
ఉత్పత్తి కులాల వద్ద పెట్టుబడి లేక దళారులు శాసిస్తున్నారు
ముమ్మిడివరంలో ప్రముఖులు, కార్మిక, కర్షక వర్గాలతో జనసేన అధ్యక్షులు పవన్
కళ్యాణ్
ముమ్మిడివరం : అన్నం పెట్టే రైతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా జనసేన పార్టీ
అండగా నిలుస్తుంది. గిట్టుబాటు ధర లేక కాయకష్టం చేసిన రైతులు ఆత్మహత్యలు
చేసుకుంటుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి దళారులు అనాయాసంగా రైతులని
దోచుకొని సంపాదిస్తున్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరికీ రైతు బాధ తెలియాలి.
ఉత్పత్తి కులాల వద్ద పెట్టుబడి లేకపోవడం వల్లే దళారులు శాసిస్తున్నారు. జనసేన
పార్టీ పాలన పగ్గాలు చేపట్టాక ఆ పెట్టుబడి ప్రభుత్వం ద్వారా అందిస్తామని జనసేన
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం ముమ్మిడివరం నియోజకవర్గంలో
ఏర్పాటు చేసిన కార్మిక, కర్షక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులుతో
పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రైతులు, మత్య్సకారులతో పాటు వివిధ వర్గాల
సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రైతు సమస్యల
పరిష్కారానికి ఉమ్మడి కార్యచరణ అవసరం. రైతు సమస్యల పరిష్కారానికి కలసి
వస్తామంటే అన్ని పార్టీల్లో ఉన్న రైతు సంఘాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.
మనలో అనైక్యత వల్లే దళారులు దోచుకుంటున్నారు. తుపాను వచ్చినప్పుడు వైసీపీ
రైతుల పంటలకు మాత్రమే నష్టం వాటిల్లదు. ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా
పిలుచుకునే గోదావరి జిల్లాలు నేడు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి
జిల్లాల్లో రైతుని రక్షించుకోలేక పోతే ఆ ప్రభావం మిగిలిన జిల్లాల మీద కూడా
పడుతుంది. రైతుల పక్షాన రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచేందుకు నేను సిద్దం.
పంట పండించిన రైతుకి మద్దతు ధర వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. క్రాప్ హాలిడే
ప్రకటించి నిరసన తెలుపుతున్నా అధికారులు తొంగి చూడడం లేదు. ఈ పరిస్థితులు
మారాలన్నారు.
విగ్రహాలు పెడితే సరిపోదు
మత్స్యకార గ్రామాల్లోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గ్రామాల్లో 40 శాతం
ప్రజలకు ఇప్పటికీ తాగునీరు లేదు. సంఘటితంగా ఉన్న కులాలను కార్పోరేషన్ల పేరిట
విభజించారు. రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇచ్చారు. 100 అడుగుల అంబేద్కర్
విగ్రహం పెడితే సరిపోదు. ఆయన రాజ్యాంగం ద్వారా సామాన్యులకు అందించిన హక్కులను
కాపాడాలి. రాజ్యాంగ ధర్మాన్ని అనుసరించి పాలన చేయాలి. అన్ని కులాలను కలుపుకుని
వెళ్లాలి. అంబేద్కర్ సిద్ధాంతాలు పాటించడం అంటే రాజ్యంగ హక్కులు అందరికీ సమంగా
పంచడం. దివగంత దామోదరం సంజీవయ్య, దివంగత జి.ఎమ్.సి బాలయోగి ప్రజల కోసం ఆలోచన
చేసిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి. వాళ్ళు తమ కోసం కాదు భావి తరాల
కోసం పని చేశారు. జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. కులాలను కలిపే
ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నారు.
కోనసీమ రైతుల కష్టాలు ఏకరవు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు జీఆర్కే బాలకృష్ణ,
ఉమామహేశ్వరరావు, లక్ష్మినారాయణలు కోనసీమ రైతు కష్టాలు పవన్ కళ్యాణ్ ఎదుట
ఏకరువుపెట్టారు. ఒకప్పుడు కోనసీమ రైతాంగం సుభిక్షంగా ఉండేవారనీ, పండిన పంటను
దాచుకని ధర పలికినప్పుడు అమ్ముకునేవాళ్లం. ఇప్పుడు వదిలించుకోవాలని
చూస్తున్నామన్నారు. సామాజికంగా గౌరవం కోసమే వ్యవసాయం చేయాల్సివస్తోందన్నారు.
ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉంటే రైతుకి మద్దతు ధర దక్కదు. బియ్యం ఎగుమతిలో నేనే
రారాజుని అని బాహాటంగా చెప్పుకుంటున్నాడు. రైతు చెమటను దోచుకుంటున్నారు.
బస్తాకి రు.100 వారికి వెళ్లిపోతుంది. రైతు సంఘాల్లో రైతులు లేరు. ధాన్యం
కొనుగోలు చేశాక రైతుకి డబ్బు ఇవ్వడానికి 21 రోజుల నుంచి 2 నెలలు పడుతుందని
తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో మూడు రోజులకే డబ్బు వేసేశారని
చెప్పుకొచ్చారు. అందరి సమస్యలు సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన
ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకార
వర్గాలు, గీత కార్మికులు తమ కష్టాలు తెలిపారు. వైద్యులు ప్రజారోగ్య విధానాలను
పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
జనసేన మేనిఫెస్టో ఆలోచన బృందంలో స్థానం
ఈ చర్చాగోష్టిలో పాల్గొన్న కోరంగికి చెందిన పెండ్యాల ప్రభాకర్, నీలపల్లికి
చెందిన చింతా శివ పలు అంశాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. కుటీర
పరిశ్రమను నిర్వహించే పెండ్యాల ప్రభాకర్ ప్రభుత్వం ప్రజలందరికీ బీమా
చేయించాల్సిన ఆవశ్యకతను, అందుకు సంబంధించిన ఆలోచనలను పంచుకున్నారు. కౌలు రైతుల
బాధలు, వాటిని అధిగ మించడం గురించి చర్చించారు. చింతా శివ మాట్లాడుతూ
విద్యార్థి దశ నుంచే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాల
కల్పన గురించి తన ఆలోచనలు పంచుకున్నారు. వారిద్దరిని పార్టీ మేనిఫెస్టో ఆలోచన
బృందంలో స్థానం కల్పిస్తామని ఆహ్వానించారు. సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్,
పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.