ఆ మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ చెయ్యడం నా పూర్వ జన్మ సుకృతం : వెంకయ్య నాయుడు
తెన్నేటి విశ్వనాధం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఉప
రాష్ట్రపతి
రాజమహేంద్రవరం : స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర
కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రియ శిష్యులు, ఆంధ్ర రాష్ట్ర తొలి రెవెన్యూ
మంత్రి తెన్నేటి విశ్వనాధం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో
సంతోషంగా ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం
స్థానిక ఆంధ్ర కేసరి సెంటినరీ జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల అర్థ శతాబ్ది
ఉత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెన్నేటి విశ్వనాధం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
మాట్లాడుతూ, నైతిక విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు అతీతంగా
ప్రజా సేవే పరమావధిగా భావించి రాజకీయాలు నెరపిన కొద్ది మంది నాయకుల్లో
అగ్రగణ్యులు శ్రీ తెన్నేటి విశ్వనాధం ఒకరని పేర్కొన్నారు. న్యాయ శాస్త్రం,
ఆంగ్ల భాషలోను పట్టభద్రులై, మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టిన
తెన్నేటి విశ్వనాథం గాంధీజీ పిలుపుతో 1922 లో న్యాయవాద వృత్తిని వదలి
స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఉండి గాంధీజీ
సిద్ధాంతాలు ఔపోసనం పట్టి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పార్లమెంటరీ
కార్యదర్శిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ రెవెన్యూశాఖ మంత్రిగా ప్రకాశంగారి మంత్రి
వర్గంలో పనిచేశారన్నారు. విశాఖ మున్సిపల్ చైర్మన్ గా, శాసన సభ్యునిగా,
పార్లమెంటు సభ్యునిగా సేవలందించి విశాఖ ఉక్కు ఫాక్టరీ కోసం పదవీత్యాగం చేసిన
ధీరుడు, పదవులకే వన్నె తెచ్చిన మహోన్నతుడన్నారు. ఆదర్శ ప్రజానాయకుడు గా
తెన్నేటి విశ్వనాథం ని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఆ మహనీయుని విగ్రహం నా చేతుల
మీదుగా ప్రారంభం జరగటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తాను ఆంధ్ర యూనివర్సిటీలో
చదువుకునే రోజుల్లో శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు పరిచయం అయ్యారని, ఆ సమయంలో
వారు నిర్వహించే సాహిత్య గోష్టిలో పండితులు భాగవతం మహాభారతం రామాయణం వంటి
ఇతిహాసాలను వ్యాఖ్యానం చేసేవారన్నారు. తన చిన్నతనంలో దురుసుగా, ఆవేశపూరితంగా
ఉండేవాడినని వారితో సాహిత్య సాన్నిత్యం పొందడం వలన వారు నాకు
మార్గదర్శకయ్యారని అన్నారు. నేను ఏ సభకు వెళ్లిన వారిని స్మరిస్తుంటానని
తెలిపారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మీయుడు, అణుంగుడు అయిన
తెన్నేటి విశ్వనాథం విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ
సందర్భంగా కళాశాల విద్యార్థులకు అధ్యాపకులకు పూర్వపు విద్యార్థులకు పూర్వపు
అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకొని
ముందుకు వెళుతున్న కళాశాలకు మరింత భవిష్యత్తు ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి
ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం అనగానే ఒకవైపు వేద ఘోష, మరోవైపు
గోదావరి గలగలం, దాని కంటికి రెప్పలా కాచే సోమలమ్మ తల్లి దేవాలయం
క్షేత్రపాలకుడు వేణుగోపాలకృష్ణ శిల్ప సంపద ఆలయాలు, నన్నయ్య వ్రాసిన
ఆంధ్ర,మహాభారతం, కాటన్ మహాశయుడు నిర్మించిన ధవలేశ్వరం ప్రతి ఒక్కటి ఆనందాన్ని
స్ఫూర్తిని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అన్నారు . తెన్నేటి విశ్వనాధం వారి
ఎన్నంటే ఉండటం వారి ప్రభావం నా మీద కొంతమంది అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ,
ఇందిరాగాంధీ, ప్రకాశం పంతులు వంటి వారితో ఆయన పని చేశారు. తెన్నేటి విశ్వనాథం
ఉద్యమ స్ఫూర్తి కారునిగా జమీందారీ విధానం, భూ సంస్కరణల వ్యవస్థ, వెంకటేశ్వర
విశ్వవిద్యాలయం, కృష్ణ బ్యారేజీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన
ప్రత్యక్ష పాత్ర ఉందన్నారు. దేశభక్తి, నిస్వార్థం, సద్గుణ సంపద ఈ తరం
యువతరానికి స్ఫూర్తిని ఇస్తాయన్నారు. మనం ప్రధానంగా ఈనాటి యువత మాతృభాష కు
ప్రాధాన్యతనిస్తూ తదుపరి అన్ని భాషల్లో పట్టు సాధించే విధంగా నైపుణ్యాన్ని
పెంచుకోవాలన్నారు. మన తెలుగు భాష పురాతనమైనదన్నారు. నేటి రాజకీయ వ్యవస్థ లోని
ప్రజా ప్రతినిధులు పార్లమెంట్, శాసనసభలో ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిత్వం,
నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు పెంచే విధంగా పని తీరు ఉండాలన్నారు. రాష్ట్రపతి
ద్రౌపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి రామనాథ్, కోవింద్, మాజీ ప్రధాన న్యాయమూర్తి
ఎన్ వి రమణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లు మాతృభాషలోనే వారి విద్యాభ్యాసాలను
పూర్తి చేశారన్నారు. రాజకీయ నాయకులు తరచూ పార్టీలు మారడం వలన నమ్మిన
సిద్ధాంతాలకు దోహదం చేయలేరన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే గాని శత్రువులు
ఉండరన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడుకోవాలన్నారు. సభ ప్రారంభకులు
మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ వెంకయ్య నాయుడు దక్షిణాన
సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ భారతదేశ ఉన్నత శిఖరాలను అధిరోహించారని
వారి జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. పొలిటిషన్ అంటే ఒక స్నేహితుడిగా
ప్రజలకు అందుబాటులో ఉండాలనే వరవడిని నేర్పిన నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర కేసరి సెంటినరీ జూనియర్ కళాశాల నిర్వాహకులు మాజీ
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు మెమేంటోని అందించి ఘనంగా సత్కరించారు. ఈ
కార్యక్రమంలో సభాధ్యక్షులు జట్టి ప్రసాద్ రావు, నిర్వాహకులు జమ్మి రామారావు,
శాసన సభ్యులు శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,
పారిశ్రామిక వేత్త బొప్ప వీరాస్వామి నాదం, మాజీ శాసనసభ్యులు రౌతు
సూర్యప్రకాశరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడు, రాజమహేంద్రి
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, కార్యక్రమ వ్యాఖ్యాత
భారత నాగిరెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.