హైదరాబాద్ : తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో ప్రమాణస్వీకారం అనంతరం నంది నగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేల తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశా నిర్దేశం చేశారు.
త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లా రెడ్డి, జగదీష్ రెడ్డి, కెపి వివేకానంద దానం నాగేందర్ సహా పలువురు పార్టీ శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతం జనసందోహంతో నిండిపోయింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న తనను కలవడానికి వేలాదిగా అసెంబ్లీ కి తరలివచ్చిన పార్టీ నేతలు అభిమానులను అధినేత పేరు పేరునా పలకరించారు.
ఈ సందర్భంగా పూల బొకేలు శాలువాలను అందించి తెలంగాణ సాధకుడు తెలంగాణ ప్రగతి ప్రదాత,తమ అధినేతతో అభిమానులు తమ అప్యాయతను పంచుకున్నారు. అభిమానుల కోరిక మేరకు వారితో కలిసి కేసీఆర్ గారు ఫోటోలు దిగారు. అనంతరం నంది నగర్లో కూడా ప్రజలు కేసీఆర్ ను కలిశారు.