విజయవాడ : మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం రాజ్భవన్లో ఘనంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ్లో భాగంగా ఆదివారం రాజ్భవన్లో జరిగిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతం భారతదేశంలో ముఖ్యమైన భాగమని, గొప్ప పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిందని అన్నారు. మణిపూర్ అంటే “రత్నాలభూమి,” , మేఘాలయ అంటే ‘మేఘాల నివాసం’, త్రిపుర దాని గొప్ప సంస్కృతి, సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఈ మూడూ పర్వత శ్రేణులు, పచ్చని లోయలతో చుట్టుముట్టబడిన చిన్న అందమైన రాష్ట్రాలు, జీవ వైవిధ్యం అని గవర్నర్ అన్నారు. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం , చరిత్ర, దేశ అభివృద్ధి అహింస, న్యాయం, భాషల వైవిధ్యం, సంస్కృతి, మతం, ఐక్యత ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ సూత్రాలపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. కార్యక్రమం వివిధ రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా మణిపూర్, మేఘాలయ త్రిపుర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జానపద పాటలను ఆలపించారు. వారి రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే సాంప్రదాయ జానపద నృత్యాలను ప్రదర్శించారు. మణిపూర్, మేఘాలయ, త్రిపుర నుండి అతిథులు, స్థానిక విశ్వవిద్యాలయాలలో చదువుతున్న ఈ మూడు రాష్ట్రాల విద్యార్థులు, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.