ముంబయి : రాజ్యాంగం ‘ఆత్మ’ దెబ్బతినకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా దానిని
అన్వయించడంలోనే న్యాయమూర్తి నైపుణ్యం కనపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ముంబయిలో
జరిగిన నానీ పాల్కీవాలా స్మారక ఉపన్యాసంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ
న్యాయమూర్తుల ముందు పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగ
మౌలిక స్వరూపం ధ్రువ నక్షత్రంలా దారి చూపుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని
సవరించడానికి పార్లమెంటుకు అపరిమిత అధికారాలుంటాయన్న కోణంలో ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్ఖడ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ మౌలిక స్వరూపం
గురించి సీజేఐ ప్రస్తావించడం గమనార్హం.
పరిపూర్ణ అధికారం ఉన్న రాజ్యాంగం, చట్టబద్ధపాలన, అధికార విభజన, న్యాయసమీక్ష,
లౌకికవాదం, వికేంద్రీకరణ, స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం, దేశ సమగ్రత తదితర భావాలను
ఆధారం చేసుకుని మన రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉందని తెలిపారు. కాలానుగుణంగా భారత
న్యాయవ్యవస్థ సైతం మార్పు చెందుతూ వస్తోందని గుర్తుచేశారు. స్వేచ్ఛాయుత
వాణిజ్యం పట్ల మన రాజ్యాంగం అంత సుముఖంగా ఉండదని, వ్యవస్థలో సమతూకం
సాధించడానికి అది ప్రయత్నిస్తుందన్నారు. అయితే సమాజం నుంచి వచ్చే వివిధ
డిమాండ్లను పరిష్కరించడానికి రాజ్యాంగ సవరణ చేసుకునేందుకు రాజ్యానికి
వెసులుబాటు ఉందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగానికి ఎవరూ మార్చలేని ఒక
నిర్దిష్ట తత్వం ఉందని నానీ పాల్కీవాలా తమకు చెబుతూ ఉండేవారని జస్టిస్
చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు.
త్వరలోనే ప్రాంతీయ భాషల్లో తీర్పు ప్రతులు : న్యాయస్థానాల తీర్పులను త్వరలోనే
ప్రాంతీయ భాషల్లో అందిస్తామని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రకటించారు.
తీర్పులను తర్జుమా చేయడానికి కృత్రిమ మేధ సాయం తీసుకుంటామని తెలిపారు. గోవా,
మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు
వెల్లడించారు.