యువత మేల్కొని రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలి
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి
వినోద్ కుమార్
వినోద్ కుమార్ తో దళిత, గిరిజన, మైనారిటీ అడ్వకేట్స్ సంఘాల ప్రతినిధుల భేటీ
హైదరాబాద్ : ప్రజలు ప్రజాప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన
అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దళిత, గిరిజన, మైనారిటీ
అడ్వకేట్స్ సంఘాల ప్రతినిధులు శనివారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో
సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం వల్లే దేశంలో
ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్డాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా
భారత రాజ్యాంగానికి అత్యంత గౌరవ స్థానం ఉందని, ఈ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు,
ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని వినోద్ కుమార్ తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ – 1 ప్రకారం ఇండియా, దటీజ్ ఈజ్ భారత్ షెల్ బీ ఏ
యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని స్పష్టంగా పేర్కొందని, రాష్ట్రాల సమూహమే భారతదేశం
అనే స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందని వినోద్ కుమార్ వివరించారు. అయితే దురదృష్టం
ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల
హక్కులను యదేచ్చగా కాల రాస్తోందని, గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఇదే పద్ధతిని అనుసరించిందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో అనుసరిస్తున్న చర్యలు
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని వినోద్ కుమార్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మొదట్లో కోపరేటివ్ ఫెడరలిజం అంటూ పదేపదే చెప్పారని,
అయితే ఇది దేశ ప్రజలకు అర్థం కాని విషయం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాతలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించారని, అది ఇప్పుడు
ప్రమాదంలో పడిపోతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత దేశ
పరిస్థితులను పరిగణలోకి తీసుకొని యువత మేల్కొని రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు
సాగాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ
పీఠిక (ఉపోద్ఘాతం) లో పేర్కొన్న విధంగా భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద,
లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి రాజ్యాంగాన్ని
రచించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.