టికెట్ రాలేదని చిన్నబుచ్చుకోవద్దు : భారాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్
హైదరాబాద్ : టికెట్లు రాలేదని హడావుడి చేసి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని
సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. టికెట్లు రానంత మాత్రాన
చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని, అనవసర హడావుడి చేసి భవిష్యత్‌ను నాశనం
చేసుకోవద్దని భారాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు.
భారాస సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని
చెప్పారు. మీరు కూడా పార్టీలోనే ఉండాలి. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని
చేయడమే కాదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, ఇలా అనేక అవకాశాలు ఉంటాయి. చాలా మంది
జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గతంలో అలా చేశాం కూడా. ఈ
ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు
తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు.
ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, భారాసకు మాత్రం ఓ టాస్క్ అని
కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు
తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల
జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు
పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ
స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు
పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు
కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ అద్భుత విజయం
సాధించాలని ఆకాంక్షించారు.
16న భారాస మేనిఫెస్టో : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో
భారాస విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పాతరంగారెడ్డి,
హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో భారాస, మజ్లిస్
గెలుస్తాయన్నారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ
స్థానాల్లోనూ విజయం సాధిస్తామని చెప్పారు. మజ్లిస్, భారాస పార్టీల మధ్య
స్నేహపూర్వక వాతావరణం ఉందని, భవిష్యత్‌లోనూ ఈ స్నేహం కొనసాగుతుందని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు భారాసను కచ్చితంగా దీవిస్తారన్న నమ్మకముందని
చెప్పారు. అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి భారాస
మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లికి
టికెట్ ఇచ్చామని, పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని
కేసీఆర్ అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది ఆయనే
నిర్ణయించుకోవాలని చెప్పారు.