పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారు
క్రెడాయ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95–100
సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు.
గత 9 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా
ముందుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పట్లేదని,
తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు.
పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని
కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నానక్‌రాంగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్
రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన
కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 63
సీట్లు గెలుచుకున్నామని, ఆ సమయంలో 10 సీట్లు అటుఇటు చేసి ప్రభుత్వాన్ని
అస్థిరపరచాలని కొందరు కుయుక్తులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. చిన్న రాష్ట్ర
ఏర్పాటే విఫలమని ప్రకటించి ఏదో చేద్దామని ప్రయత్నించారని, కానీ ప్రజలకు
స్పష్టత ఉండటంతో 2018 ఎన్నికల్లో తమకు 88 సీట్లిచ్చి గెలిపించారని చెప్పారు.
అభివృద్ధి కేవలం డైలాగ్‌లు కొడితేనే, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తేనో జరగదని,
నాయకుడికి స్థిరచిత్తం, ధృడసంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే ఆరాటం ఉంటేనే
సాక్షాత్కారం అవుతుందన్నారు. సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధికి తార్కాణం
తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
ఐపీఎస్, ఐఏఎస్‌లకు టెంపర్ : ‘రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే తొలి ఏడాది
విధానాలను అర్థం చేసుకోవడానికి, కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. చివరి
ఏడాది మళ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మధ్యలో ఉండేది మూడేళ్లే. ఈ సమయంలో
ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నాయకులకేం తెలుసు.. మేము కదా పర్మినెంట్
ఆర్టిస్టులం.. వాళ్లు గెస్ట్ అర్టిస్టులు. ఐదేళ్లకొకసారి మారిపోతారని
అనకుంటారు. వాళ్ల టెంపర్ వాళ్లది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
250 కి.మీ. వరకూ మెట్రో విస్తరణ : హైదరాబాద్‌లో మెట్రో రైలును 250 కి.మీ. వరకూ
విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 31 కి.మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్
మెట్రోను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి
హయత్‌నగర్ వరకు, ఈసీఐఎల్ నుంచి నానక్‌రాంగూడ వరకూ మెట్రోను విస్తరిస్తామని
తెలిపారు. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు
ఒక్కోటి 18.5 కి.మీ. మేర స్కైవాక్‌ను నిర్మించనున్నామని… భవిష్యత్తు అవసరాల
రీత్యా ఈ స్కైవాక్‌ల మధ్యలో మెట్రో పిల్లర్లను సైతం నిర్మిస్తామని కేటీఆర్
తెలిపారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన 16 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్
(ఎస్టీపీ)ల నిర్మాణం సెపె్టంబర్‌కు పూర్తవుతుందన్న కేటీఆర్ ఎస్టీపీల నుంచి
వచ్చే నీటిని నిర్మాణరంగ అవసరాలకు వినియోగించుకోవాలని డెవలపర్లకు సూచించారు. ఈ
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.
ప్రకాశ్‌గౌడ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్
వైస్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి,
అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.