వాస్తవ పరిస్థితులపై సమగ్ర సమాచారంతో రాయలసీమ సాగునీటి వ్యవస్థను గాడిలో
పెట్టాలి
ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల : రాయలసీమ సాగునీటి వ్యవస్థ వాస్తవ పరిస్తితి , అభివృద్ధికి
చేపట్టాల్సిన ప్రాధాన్యత కార్యాచరణ కొరకు స్వతంత్ర సంస్థ తో సమీక్ష చేపట్టి
శ్వేతపత్రం విడుదల చేయాలనీ, సాగునీటి మౌళిక వసతుల అభివృద్ధికి కార్యాచరణ
చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి
అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు. బుధవారం నంద్యాల రాయలసీమ
సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాగునీటి వ్యవస్థపై
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ఆయన విడుదల చేసారు.
ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా మీరు అధికారంలోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్
లోని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధికి కీలకమైన సాగునీటి రంగంపై అనేక
సందర్భాలలో అధికారులతో చర్చలు జరిపి, సాగునీటి రంగ అభివృద్ధికి ప్రాధాన్యతలు
ప్రకటించారని ఆయన గుర్తు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2022 – 23 వ నీటి సంవత్సరం తుంగభద్ర, కృష్ణా నదుల
పరవళ్ళతో పునీతమైందనీ, రాయలసీమ గుండా తుంగభద్ర, కృష్ణా జలాలు ఎన్నడు లేనంతగా ఈ
నీటి సంవత్సరం నిరంతరం ప్రవహించడమేగాక రావాల్సిన నీటి కంటే అధికంగా నీరు
వచ్చినప్పటీకి, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టులో సగానికి
కూడా నీరందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి వాస్తవ పరిస్థితి మీ దృష్టికి తీసుకొని రావడంలో
జరిగిన సమాచార లోపం వలన రాయలసీమ సాగునీటి మౌళిక వసతుల అభివృద్ధికి సరైన
నిర్ణయాలు జరగడంలేదని రాయలసీమ సమాజం భావిస్తున్నదని ఆయన తెలిపారు.
సాగునీటి లభ్యతకు అత్యంత అనుకూలమైన పై సంవత్సరంలో రాయలసీమ సాగునీటి దుస్థితి
పై సాగునీటి సాధన సమితి తయారు చేసిన “అస్తవ్యస్తంగా రాయలసీమ సాగునీటి వ్యవస్థ”
నివేదికను ముఖ్యమంత్రి కి పంపామని ఆయన తెలిపారు. రాయలసీమ సాగునీటి మౌళిక
వసతులు అనగా ప్రాజెక్టుల వారిగా ఏ సంవత్సరం నిర్మాణం మొదలు పెట్టారు,
నిర్మాణాలు పూర్తి చేసారు, నీటి కేటాయింపులు, నిర్దేశిత ఆయకట్టు, ఆయకట్టు
అభివృద్ధి, ప్రస్తుతం సాగు అవుతున్న ఆయకట్టు తదితర అంశాలపై స్వంతంత్ర సంస్థతో
నివేదిక రూపొందించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.
రాయలసీమ సాగునీటి మౌళిక వసతులపై ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రరాష్ట్రం (1953)
ఏర్పడిన నాటి పరిస్తితి, విశాలాంధ్ర ఏర్పడిన (1956) నాటి పరిస్తితి, తెలంగాణ
రాష్ట్రం విడిపోయిన (2014) నాటి పరిస్తితి తో పాటు నేటి పరిస్తితి (2023) పై
శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. దీని ద్వారా అయినా రాయలసీమ సాగునీటి
వ్యవస్థపై సరైన సమాచారం ముఖ్యమంత్రి కి అందుబాటులోకి వస్తుందని, జగన్ మోహన్
రెడ్డి ఆశయాల ప్రకారం రాయలసీమ సాగునీటి వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యతతో
నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామని దశరథరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం
చేశారు.