హైదరాబాద్ : రాష్ట్రంలో స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం అన్ని
చర్యలు చేపట్టిందనీ, మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి
గౌరవాన్ని పెంపొందిస్తూ, స్త్రీ జనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు,
అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
తెలిపారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ
దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో
రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి
నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు
కార్యక్రమాలతో కూడిన పాటల వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది.
సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి
సంపూర్ణం అవుతుంది. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం,
ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప
పథకాలను అమలు చేస్తూ వారిని రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా
కాపాడుకుంటోందన్నారు.
గర్భిణి దశ నుంచే : గర్భిణులు, బాలింతల సంక్షేమంలో భాగంగా కేసీఆర్ కిట్
పథకం కింద లబ్ధిదారులకు అమ్మాయి పుడితే రూ.13 వేలను, అబ్బాయి పుడితే రూ.12
వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 13,90,639 మంది
లబ్ధిపొందగా.. ప్రభుత్వం రూ.1261.67 కోట్లు వెచ్చించింది. గర్భిణుల్లో
రక్తహీనత నివారణకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కింద విడతల వారీగా
పోషకాహార కిట్లను అందిస్తారు. గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్లలోపు చిన్నారులకు
సంపూర్ణ పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో 35,700 అంగన్వాడీల ద్వారా
ఆరోగ్యలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా
1,73,85,797 మంది ప్రయోజనం పొందారు.
మహిళల సంపూర్ణ రక్షణ, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీమ్
పేరుతో ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసింది. గర్భిణులు ఆసుపత్రులకు
వెళ్లి రావడానికి అమ్మఒడి పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా 22,19,504 మంది
ప్రయోజనం పొందగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.166.19 కోట్లను ఖర్చు చేసింది. ఆసరా
పథకం ద్వారా రాష్ట్రంలోని 1,52,050 మంది ఒంటరి మహిళలకు రూ.1,430 కోట్లను
పింఛనుగా చెల్లించింది. ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూతనందించి, వారి
తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం ద్వారా
రూ.1,00,116లను ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఈ పథకం ద్వారా 13,03,818 మంది
లబ్ధిదారులకు రూ.11,775 కోట్లను మంజూరు చేసింది.